ఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి నిప్పులు చెరిగారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం‌లో మోదీ భారీ అవినీతికి పాల్పడ్డారంటూ ధ్వజమెత్తారు. భారత్‌ ఇష్ట ప్రకారమే రిలయన్స్‌ డిఫెన్స్‌ను భాగస్వామిగా ఎంపిక చేసుకున్నామని ఫ్రాన్స్‌కు చెందిన దసాల్ట్ కంపెనీ తెలిపినట్లు ఫ్రాన్స్‌ మీడియాలో వార్తలు రావడంతో తన విమర్శలకు పదును పెట్టారు రాహుల్ గాంధీ.  

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం పక్కాగా అవినీతి కేసు అంటూ ధ్వజమెత్తారు. మోదీ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మోదీపై దర్యాప్తు చేపట్టాలని ‌ డిమాండ్‌ చేశారు. రాఫెల్ స్కాంపై ఎన్నో ఆరోపణలు వస్తున్నా మోదీ మాత్రం నోరువిప్పడం లేదని దుయ్యబుట్టారు. ప్రధాని అవినీతికి పాల్పడ్డారనడానికి ఆయన మౌనమే నిదర్శనమన్నారు. భారత ప్రధాని అవినీతిపరుడంటూ పదేపదే చెప్పుకొచ్చారు రాహుల్. అలాంటి ప్రధాని అవినీతిపై పోరాటం గురించి ప్రచారం చేయడం బాధాకరమన్నారు.

మోదీ దేశ ప్రధాని కాదని, అనిల్‌ అంబానీ అంటూ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలన్‌, ప్రస్తుతం డసో అధికారి వివరణలు చూస్తుంటే అవినీతి ఎంత స్థాయిలో జరిగిందే అర్థమవుతుందన్నారు. కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ ఒప్పందంలో తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్తున్నారని ఆరోపించారు. అవినీతి రక్షణ రంగంలో మాత్రమే కాదని అన్ని రంగాల్లో జరిగిన ఒప్పందాల్లో స్పష్టంగా కనబడుతోందని రాహుల్ ధ్వజమెత్తారు. 

భారత్‌-ఫ్రాన్స్‌ల మధ్య యుద్ధవిమానాల కొనుగోలుకు కుదుర్చుకున్న ఒప్పందంపై తీవ్ర వివాదం నెలకొంది. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ డిఫెన్స్‌ కంపెనీతో కాంట్రాక్టు కుదుర్చుకోవాలని భారత్‌ చెప్పిందని ఫ్రాన్స్‌ మాజీ అధ్యక్షుడు హోలన్‌ వెల్లడించడంతో ఈ దుమారం రేగింది. అయితే భాగస్వామి ఎంపిక ఫ్రాన్స్‌ డిఫెన్స్‌ కంపెనీ దసాల్ట్ దే అని తమకెలాంటి సంబంధం లేదని బీజేపీ చెప్తూ వస్తోంది. 

అయితే తాజాగా రఫేల్‌ ఒప్పందం కుదుర్చుకునేందుకే ఆఫ్‌సెట్‌ భాగస్వామిగా రిలయన్స్‌ డిఫెన్స్‌ను ఎంచుకోవాల్సి వచ్చిందని దసాల్ట్ ఏవియేషన్‌ వెల్లడించినట్లు ఫ్రాన్స్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. 

రాఫెల్‌ ఒప్పందాన్ని సొంతం చేసుకునేందుకే రిలయన్స్‌ డిఫెన్స్‌ను వ్యాపార భాగస్వామిగా చేర్చుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో దసాల్ట్ గురువారం వివరణ ఇచ్చింది. భారత్‌కు చెందిన రిలయన్స్‌ గ్రూప్‌ను భాగస్వామిగా ఎంపిక చేసుకోవడంలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. 2017, ఫిబ్రవరి 10న దసాల్ట్ రిలయన్స్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్‌ జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటైందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.