మన దేశంలో కొన్ని నగరాలు, రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయని, అయితే పరిస్థితులను పరిశీలించాల్సి ఉన్నదని కేంద్ర ప్రభుత్వం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కరోనా కేసులు తగ్గుతున్నా.. రిస్క్ ఎప్పట్లాగే ఉంటుందని తెలిపారు. అందుకే ఆయా ప్రాంతాల్లో కరోనా పరిస్థితులను బట్టి తగిన చర్యలు తీసుకోవాలని, టీకా కవరేజీని పెంచాలని సూచించింది. 

న్యూఢిల్లీ: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే, పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉన్నదని కేంద్ర ప్రభుత్వం గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. కొన్ని నగరాలు, కొన్ని రాష్ట్రాల్లో కేసులు తగ్గుముఖం పడుతున్నా.. రిస్క్ మాత్రం ఎప్పటిలాగే ఉన్నదని వివరించింది. అందుకే అందరూ జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. వైరస్ వ్యాప్తికి బ్రేక్ వేయడంపైనే ఫోకస్ పెట్టాలని తెలిపింది. కాబట్టి, పరిస్థితులకు, ప్రాంతాలకు తగినట్టుగా కేసుల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచనలు చేసింది. అలాగే, టీకా కవరేజీని పెంచాలని తెలిపింది. అన్ని దేశాలకు ఇవే సూత్రాలు వర్తిస్తాయని వివరించింది.

మన దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయా? అని అడిగిన ప్రశ్నకు డబ్ల్యూహెచ్‌వో ఆగ్నేయా రీజనల్ డైరెక్టర్ డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ సమాధానం చెప్పారు. ప్రతి దేశంలోనూ కరోనా ముప్పు పొంచే ఉన్నదని వివరించారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి.. కేసులు తగ్గుతున్నాయని చర్యలపై ఉదాసీనంగా వ్యవహరించరాదని తెలిపారు. ఏ దేశం కూడా కరోనా ముప్పు నుంచి బయటపడేలదని స్పష్టం చేశారు. కాబట్టి, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరించారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడంపై అందరూ ఫోకస్ పెట్టాలని సూచనలు చేశారు.

కరోనా వైరస్ మహమ్మారి నుంచి ఎండెమిక్ స్టేజ్‌కు వెళ్తున్నదా? అని అడగ్గా.. మనం ఇప్పటికీ ఇంకా మహమ్మారి మధ్యలోనే ఉన్నామని వివరించారు. వైరస్ వ్యాప్తిని తగ్గించడం, ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా ఉండాలని తెలిపారు. ఒక వేళ ఈ వైరస్ ఎండెమిక్‌గా మారినా.. ఆందోళనకారకంగా ఉండదని భ్రమ పడవద్దని అన్నారు. ఎండెమిక్‌గా ఉన్నప్పటికీ వైరస్ ముప్పు ఉంటుందని వివరించారు.

డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా హాస్పిటలైజేషన్ తక్కువగా ఉన్నదనే విషయాన్ని డాక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ ధ్రువీకరించారు. అయితే, వయోధికుల్లో, ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్న వారిలో, టీకా వేసుకోనివారిలో ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత ఎక్కువగా ఉన్నదని తెలిపారు. అందుకే టీకా పంపిణీ వేగం పెంచాలని వివరించారు.

ఇదిలా ఉండగా, దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,35,532 కోవిడ్ కేసులు (Covid cases) నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులో భారత్‌లో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,08,58,241కి చేరింది. తాజాగా కరోనాతో 871 మంది మృతిచెందారు. అయితే తాజాగా మరణాల్లో గత 24 గంటల్లో 613 మంది మృతిచెందగా.. కేరళ ప్రభుత్వం 258 బ్యాక్ లాగ్ మరణాలు నమోదు చేసింది. దీంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 4,93,198కి పెరిగింది. 

గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,35,939 కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,83,60,710కి చేరింది. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 20,04,333గా ఉంది. ఇక, తాజా నమోదైన కొత్త కేసులలో.. కేరళలో అత్యధికంగా కేరళలో 54,537, కర్ణాటకలో 31,198, తమిళనాడులో 26,533, మహారాష్ట్రలో 24,948, ఆంధ్రప్రదేశ్‌లో 12,561 కేసులు నమోదయ్యాయి