భారత్ ను హిందూ దేశంగా ప్రకటిస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని టీఎంసీ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా బీజేపీపై వ్యంగాస్త్రాలు సంధించారు. వెంటనే రాజ్యాంగాన్ని సవరించి ఆ పనిని పూర్తి చేయాలని సూచించారు.
కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యశ్వంత్ సిన్హా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం దేశ సమస్యలన్నింటికీ సరళమైన పరిష్కారాన్ని ప్రకటిస్తోందని అన్నారు. భారత రూపాయి గతంలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి చేరుకోవడంతో పాటు, ఆర్థిక దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ నేడు మన సమస్యలన్నింటికీ సరళమైన పరిష్కారం ఒకటే. రాజ్యాంగాన్ని సవరించి, ఇతర అన్ని మతాలను నిషేధించండి. భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించింది. హిందూయేతర చరిత్రను తొలగించండి. బౌద్ధులు, జైనులు, ముస్లింలు, క్రిస్టియన్లు హిందువులపై గతంలో చేసిన తప్పులకు ప్రతీకారం తీర్చుకోండి’’ అని యశ్వంత్ సిన్హా ట్వీట్ చేశారు.
ఈ వీకెండ్ లో యశ్వంత్ సిన్హా (ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన ఓ ఒపినీయన్ ఆర్టికల్ ను ఆధారంగా చేసుకొని) దేశం క్రమంగా మత విద్వేషం, హింసలో శీఘ్రంగా మునిగిపోతుందని ఆరోపించారు. దేశంలో ఆర్థిక పరిస్థితిని కూడా ఆయన ఎత్తి చూపారు, ప్రస్తుత పరిస్థితి ‘‘హింసకు పరిపక్వత చెందింది’’ అని ఆయన వాదించారు.
గత వారం ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదలపై టీఎంసీ తీవ్రంగా స్పందించింది. ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇంధనం, వస్తువుల ధరలను పదే పదే పెంచి భారత ప్రజలను హింసిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం దివాళా తీసి గత రెండేళ్లలో ఇంధన ధరల పెంపు ద్వారా ప్రజల నుంచి రూ.17 లక్షల కోట్లు తీసుకుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి సుఖేందు శేఖర్ రే ఆరోపించారు.
అలాగే ఆర్థిక దుర్వినియోగం దేశం లోతైన ఆర్థిక సంక్షోభం వైపు వెళ్తోందని టీఎంసీ సోమవారం కేంద్రంపై విరుచుకుపడింది. సమస్యను పరిష్కరించడంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విఫలమైందని పార్టీ తెలిపింది. ఎల్జీజీ ధరలు ఇటీవల రూ .50 పెరిగాయి. రెండు నెలల వ్యవధిలో ఇలా ధరలు పెరగడం ఇది రెండో సారి.ఈ పెరిగిన ధరలతో దేశంలో వంటగ్యాస్ సిలిండర్ ధర చెన్నై, కోల్కతాలో రూ.1,000కు పైగా ఉండగా, ఢిల్లీ, ముంబైల్లో రూ.999.50గా ఉంది.
పెరిగిన ఎల్పీజీ ధరలపై మూడు రోజుల కిందట రాహుల్ గాంధీ కూడా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఒక ఎల్పీజీ సిలిండర్ ధర 2014 లో రూ. 410 గా ఉండేదని చెప్పారు. అది నేడు రూ.999 కు పెరిగిందని పేర్కొన్నారు. ‘‘ ఇప్పటి ధరకు అప్పుడు రెండు సిలిండర్లు వచ్చేవి ! పేద, మధ్యతరగతి భారతీయ కుటుంబాల సంక్షేమం కోసం కాంగ్రెస్ మాత్రమే పని చేస్తుంది. ఇది మా ఆర్థిక విధానంలో ప్రధానమైనది ’’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే పని చేస్తుందని చెప్పారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు చేశారు. ప్రధాని విదేశాల నుంచి వస్తూ పేదల కోసం ఎల్పీజీ ధరలను పెంచి బహుమతిగా ఇచ్చారని ఎద్దేవా చేశారు.
