నిన్నటి వరకు మనతోనే వున్న ఆత్మీయులు కళ్లేదుటే అనంతలోకాలకు వెళితే.. వారినే తలచుకుంటూ లోలోపల కుమిలిపోతారు. అలాంటిది చనిపోయిన వారు మూడు నెలల తర్వాత సజీవంగా తిరిగివస్తే.. పట్టరాని సంతోషం కలిగినా, ముందు ఆశ్చర్యంతో నోట మాట రాదు. కేరళలో అచ్చం అలాంటి ఘటనే జరిగింది. 

వివరాల్లోకి వెళితే.. సాబూ అనే వ్యక్తి తిరువనంతపురంలో క్యాటరింగ్, బస్‌ క్లీనింగ్‌ వంటి ఉద్యోగాలు చేసేవాడు. చిన్న చిన్న చోరీలు చేసే అలవాటూ ఉంది. ఈ నేపథ్యంలో తాను పనిచేసే హోటల్‌లో డబ్బు దొంగతనం కేసులో పోలీసులు సాబూను గతేడాది నవంబరులో అరెస్టు చేశారు.

ఆ తర్వాత అతని క్షేమ సమాచారం గురించి కుటుంబ సభ్యులకు ఏం తెలియదు. అయితే గతేడాది డిసెంబర్‌ 24న కొట్టాయం జిల్లా పాలా పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు.

తిరువనంతపురం పోలీసులు ఆ మృతదేహం సాబూదేనని  అనుమానంచి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  అయితే ఆ దేహం సాబూదేనని పొరపడిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

ఇది జరిగి మూడు నెలలు కూడా గడిచిపోయాయి. ఈ క్రమంలో గత శుక్రవారం ఒక బస్‌ డ్రైవర్‌కు సాబూ కనిపించాడు. వెంటనే విషయాన్ని పోలీసులకు, కుటుంబ సభ్యులకూ తెలియజేశారు. దీంతో పోలీసులు...సాబూనే  అనుకుని అంత్యక్రియలు జరిపిన మృతదేహం ఎవరిదో తెలుసుకునే పనిలో పడ్డారు.