అప్పులు బాధ తట్టుకోలేక ఓ కుటుంబం ప్రాణాలు కోల్పోయింది. ఓ వ్యక్తి ఇంట్లోని కుటుంబసభ్యులు నలుగురిని హత్య చేసి..  అనంతరం తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరులో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... మైసూర్ కి చెందిన ఓంకార్ ప్రసాద్(33) తల్లిదండ్రులు, భార్య, కొడుకుతో  కలిసి నివసిస్తున్నాడు. కాగా...మూడు రోజుల క్రితం ఓంకార్ ప్రసాద్ కుటుంబసభ్యులతో  కలిసి మైసూర్ నుంచి బండిపూర్ అడవికి సమీపంలోని ఓ ఫామ్ హౌస్ కి వచ్చారు. అక్కడి నుంచి గురువారం రాత్రి కారులో గండల్ పేటలోని ఓ లాడ్జ్ కి వచ్చారు.

కాగా... శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో... ఓంకార్ ప్రసాద్.. తన తండ్రి నాగరాజ్ భట్టాచార్య(60), తల్లి హేమలత(54), భార్య నిఖిత(27), కొడుకు ఆర్య కృష్ణ(5) లను తుపాకీతో  కాల్చి చంపాడు. అనంతరం లాడ్జ్ లోని ఓపెన్ ప్లేస్ కి వచ్చి తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 

కాగా.. హోటల్ లో ఎలాంటి సూసైడ్ నోట్ కూడా దొరకలేదని పోలీసులు చెబుతున్నారు. కాగా.. కుటుంబ ఆర్థిక పరిస్థితి, అప్పుల కారణంగానే వారు ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వారి మరణాలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.