భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2047 టార్గెట్‌గా పెట్టారు. అందుకోసం ఆయన ఓ విజన్‌ను ఈ రోజు ఎర్రకోటపై ప్రసంగిస్తూ ఆవిష్కరించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. మోడీ ప్రభుత్వం 2022 కల్లా పూర్తి చేస్తామన్న హామీలను 2047కు వాయిదా వేసిందా? అనే వాదనలు మొదలయ్యి. 2022 కల్లా ప్రతి పౌరుడికి ఇల్లు, రైతుల ఆదాయం రెట్టింపు, బుల్లెట్ ట్రైన్, 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధిస్తామని హామీలు ఇచ్చారు.

న్యూఢిల్లీ: ఈ రోజు ఎర్రకోట పై జాతీయ జెండా ఎగరేసిన ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి గొప్ప విషయాలు మాట్లాడారు. మన దేశం ఏ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పారు. ఇతర దేశాల గుర్తింపు కొనే బానిస మనస్తత్వాన్ని వదులుకోవాలని అన్నారు. మన పురాతన సంస్కృతి పట్ల గర్వించాలని తెలిపారు. మహిళలను గౌరవించాలని, దేశ పురోగమనంలో వారిని వెంట తీసుకెళ్లితే అమోఘమైన విజయాలు లభిస్తాయని వివరించారు. అంతేకాదు, మన దేశం పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి 2047వ సంవత్సరం వరకు ఓ విజన్ ఆవిష్కరించారు.

2047వ సంవత్సరానికల్లా దేశం ఎలా అభివృద్ధి చెందాలనే విషయాలను ప్రధాని మోడీ మాట్లాడారు. దీంతో సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. భారత అభివృద్ధికి డెడ్ లైన్‌ను 2022 నుంచి 2047కు వాయిదా వేశారా? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. ఈ చర్చలోనే గతంలో ప్రధాని మోడీ ప్రకటించిన హామీలు.. ముఖ్యంగా 2022 కల్లా పూర్తి చేస్తామన్న గంభీరమైన వాగ్దానాలను నెటిజన్లు గుర్తు చేశారు.

2022 కల్లా ప్రతి భారత పౌరుడు సొంత ఇంటిలో ఉంటాడని, 2022 కల్లా ప్రతి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న హామీలు ఈ చర్చలో ప్రధానంగా ఉన్నాయి.

2018 జూన్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజనా గ్రామీణ (పీఎంఏవై - జీ ) లబ్దిదారులతో నమో యాప్ ద్వారా మాట్లాడుతూ.. 2022 కల్లా ప్రతి పౌరుడికి సొంత ఇల్లు ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆవాస్ యోజనా అంటే కేవలం ఇటుకలు, మోర్టార్ కాదని అన్నారు. ఈ స్కీమ్ అంటే జీవిత ప్రమాణాలు మెరుగుపరచడడం, సొంతింటి కలను సాకారం చేయడం అని వివరించారు. భారత దేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న కాలానికి 2022 కల్లా ప్రతి పౌరుడికి సొంత ఇల్లు ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు.

అదే ఏడాది రైతులతో మాట్లాడుతూ మరో కీలక హామీ ఇచ్చారు. ప్రభుత్వ విధానాల కారణంగా ఇప్పుడు రైతులు ఆందోళనలు లేకుండా హాయిగా ఉంటున్నారని, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన పంటకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి ఇన్సూరెన్స్ స్కీమ్‌ల ద్వారా చింతలు లేకుండా ఉంటున్నారని వివరించారు. అంతేకాదు, రైతులు ఆదాయాలను రెట్టింపు చేస్తామని పునరుద్ఘాటించారు. బడ్జెట్ కేటాయింపులు పెంచుతామని వివరించారు.

2018తో పోల్చితే 2022లో రైతలు ఆదాయాలు 1.3 నుంచి 1.7 రెట్లు పెరిగాయని ఇటీవలి ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్టు వెల్లడిస్తున్నది.

బీజేపీ ప్రభుత్వం హామీలను గాలికి వదిలేస్తున్నదని కాంగ్రెస్ తరుచూ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ ఈ హామీలపై బీజేపీని ప్రశ్నించారు. 2022 కల్లా ప్రతి పౌరుడికి ఇల్లు, రైతుల ఆదాయాలు రెట్టింపు, బుల్లెట్ ట్రైన్ పరుగులు, భారత ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు పెరగడం వంటి హామీలను పేర్కొంటూ నిలదీశారు.

గత సార్వత్రిక ఎన్నికలకు ముందటి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవంలో మాట్లాడుతూ ప్రధాని మోడీ.. 2022 కల్లా భారత దేశ కుమారుడు లేదా కుమార్తె జాతీయ జెండాను చేతిలో పట్టుకుని అంతరిక్షానికి వెళ్లుతారని చెప్పారు.

2018లో అప్పటి కేంద్ర రైల్వే మంత్రి పియూష్ గోయల్ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ 2022లో ప్రారంభం అవుతుందని తెలిపారు. కానీ, తొలి బుల్లెట్ ట్రైన్ 2026లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని జూన్‌లో తెలిపారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఈ జాప్యానికి ప్రధానంగా భూ సేకరణలో సమస్యలు, కరోనా మహమ్మారిని కారణాలుగా చెబుతున్నది.