టర్కీ-సిరియా భూకంపం.. 11,200లు దాటిన మరణాలు.. కాలానికి పోటీగా సహాయక చర్యలు
టర్కీ, సిరియాల్లో సోమవారం రాత్రి నుంచి వరుస భూకంపాలు సంభవించాయి. వీటి కారణంగా మరణించిన వారి సంఖ్య 11,200 దాటేసింది. శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకుని ఉండటంతో ఈ సంఖ్య మరికొంత పెరిగే అవకాశం ఉన్నది.

టర్కీ, సిరియాల్లో వరుస భూకంపాలతో తీవ్ర ప్రాణ నష్ట జరిగింది. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు నేలమట్టం అయ్యాయి. సోమవారం అంతా నిద్రలో ఉండగా సంభవించిన భూకంపం చాలా మందిని పొట్టనబెట్టుకుంది. ఆ తర్వాత కూడా భూకంపాలు చోటుచేసుకోవడం.. భవనాలు కూలిపోయి శిథిలాలు గుట్టలయ్యాయి. వీటి కింద వేలాది మంది చిక్కుకుపోయారు. కొన ఊపిరితో ఇప్పటికీ ఆ శిథిలాల కింద ప్రాణాల కోసం కొట్టమిట్టాడేవారు ఉన్నారు. వారి కోసం కాలానికి పోటీ పడి రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఈ వైపరీత్యంతో మరణించిన వారి సంఖ్య 11,200ను దాటేసింది.
Also Read: సిరియాలో శిథిలాల కింద తమ్ముడి తలను రెక్కకింద దాచిన సోదరి.. కదిలిస్తున్న చిత్రమిదే
టర్కీ, సిరియాల్లో ఇప్పుడు దారుణమైన చలి ఉన్నది. సోమవారం తర్వాత ఇప్పటి వరకు తీవ్రమైన చలిలోనూ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉన్నాయి. కాలానికి పోటీ పడి రెస్క్యూ ఆపరేషన్స్ చేపడుతున్నట్టు అధికారులు చెప్పారు.
శిథిలాల కింద నుంచి రక్షిస్తున్న సహాయక సిబ్బంది కొన్ని అసాధారణ ఘటనలను చూస్తున్నారు. టర్కీ, సిరియా సరిహద్దులో తిరుగుబాటుదారుల అధీనంలోని జిండారిస్ పట్టణంలో శిథిలాల కింద అప్పుడే జన్మించిన పాప సజీవంగా, సురక్షితంగా అధికారులు బయటకు తీశారు. ఆ చిన్నారికి ఇంకా కన్నపేగు అలాగే ఉన్నది. పాపకు జన్మనిచ్చిన తల్లి సహా ఆ కుటుంబంలోని వారంతా మరణించారు.
అసాధారణ పరిస్థితుల్లోనే అసాధారణ సంఘటనలు జరుగుతాయి.శిథిలాల కింద తానే ఇంకెంత కాలం ఊపిరిపీల్చుకుంటుందో తెలియని స్థితిలో ఏడేళ్ల చిన్నారి తల్లి తన తమ్ముడి ప్రాణం కోసం ఆరాటపడింది. తమ్ముడి తలను పక్షి తన గుడ్లను రెక్కల కిందకు తీసుకుని భద్రంగా చూసుకున్నట్టే తన రెక్క కిందకు తీసుకుంది. ఆ శిథిలాలు మరింత కిందికి జరిగితే తమ్ముడి తలకు గాయాలు కావొద్దని ఆలోచించింది. వారిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ శిథిలాల కింద 17 గంటలు గడిపిన తర్వాత అదృష్టవశాత్తు ఆ చిన్నారులు ఇద్దరూ సురక్షితంగా బయటపడ్డారని వివరించారు.