జార్ఖండ్‌ జైలులో రెండు గ్రూపులకు మధ్య 2019లో ఘర్షణలు జరిగాయి. ఇందులో తీవ్రంగా గాయపడ్డ ఓ ఖైదీ హాస్పిటల్‌కు తీసుకెళ్లుతుండగా మరణించాడు. ఈ కేసును విచారించిన జిల్లా కోర్టు 15 మందికి మరణ శిక్ష విధించింది. మరో ఏడుగురికి పదేళ్ల జైలు శిక్ష విధించింది. 

న్యూఢిల్లీ: జార్ఖండ్‌లోని ఓ జైలులో ఖైదీని చంపినందుకు 15 మంది దోషులకు మరణ శిక్ష పడటం సంచలనంగా మారింది. జంషేడ్‌‌పూర్‌లోని ఘాఘిదిహ్ సెంట్రల్ జైలులో రెండు గ్రూపులకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణల్లో ఓ ఖైదీ మరణించాడు. ఈ కేసును తూర్పు సింఘ్‌భమ్ జిల్లాలోని జిల్లా కోర్టు విచారించింది.

2019 జూన్ 25వ తేదీన జైలులో రెండు ఖైదీ గ్రూపులు పరస్పరం ఘర్షణ పడ్డాయి. తీవ్రంగా దాడి చేసుకున్నాయి. ఇందులో మనోజ్ కుమార్ సింగ్ సహా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. వారిని హాస్పిటల్‌కు తరలిస్తుండగా మనోసజ్ కుమార్ సింగ్ గాయాలతో మరణించాడు. ఈ ఘటనపై పర్సుదిహ్ పోలీసు స్టేషన్‌లో ఓ కేసు నమోదైంది.

ఈ కేసుపై అదనపు జిల్లా జడ్జీ- 4 రాజేంద్ర కుమార్ సిన్హా తీర్పు ఇచ్చారు. ఐపీసీ సెక్షన్స్ 302 (హత్య), 120బీ (నేరపూరిత కుట్ర) కేసులో 15 మందికి మరణ శిక్ష విధించినట్టు అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ కుమార్ తెలిపారు. మరో ఏడుగురికి పదేళ్ల జైలు శిక్ష విధించారు. వీరిని ఐపీసీలోని సెక్షన్ 307 (హత్యా ప్రయత్నం) కింద నేరస్తులుగా నిర్దారించింది. మరణ శిక్ష పడ్డ ఇద్దరు దోషులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న ఆ ఇద్దరిని వెంటనే పట్టుకోవాలని, అందుకు సంబంధించి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని కోర్టు ఆదేశించింది. వీలైనంత త్వరగా కోర్టులో ఆ ఇద్దరినీ హాజరుపరచాలనిి తెలిపింది. 

వారిని పట్టుకోవడానికి గాలింపులు చేపడుతున్నట్టు పోలీసులు వివరించారు.