కేంద్ర ప్రభుత్వ  ఉద్యోగులకు (Central government employees) మోదీ  సర్కార్  గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ  ఉద్యోగుల డియర్‌నెస్  అలవెన్స్ పెంపు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్  గురువారం ఆమోదం తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Central government employees) మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్‌నెస్ అలవెన్స్ పెంపు ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ (DA Hike), పెన్షనర్ల డీఆర్ మూడు శాతం పెరగడంతో.. 31 శాతానికి చేరనుంది. ప్రభుత్వోద్యోగులకు డీఏ అదనపు ఇన్‌స్టాల్‌మెంట్, పెన్షనర్లకు డియర్‌నెస్ రిలీఫ్ (డీఆర్) అదనపు ఇన్‌స్టాల్‌మెంట్ విడుదలకు కేబినెట్ (Unioin Cabinet) ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం జూలై 1, 2021 నుంచి అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. డీఏ మరియు డీఆర్ పెంపు ప్రకటన దాదాపు 47.14 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు 68.62 లక్షల పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఖజానాపై ఏడాదికి దాదాపు రూ. 9,488.70 కోట్ల ఆర్థిక భారం పడనుంది. 

ఇక, ఇంతుకు ముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏను 17 శాతం నుంచి 28 శాతానికి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ 3 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో డీఏ పెంపు కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు కేంద్రం దీపావళి సందర్భంగా ఈ కానుకను అందించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

ఈ సందర్భంగా మంత్రి అనురాగ్ ఠాకూరు మాట్లాడుతూ.. భారత్‌ 100 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ మోతాదుల మైలురాయిని అధిగమించిన విషయాన్ని కూడా ప్రస్తవించారు. ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నట్టుగా చెప్పారు. ఆందోళన కలిగించే వాతావరణం ఉన్నప్పటికీ తాము ఈ ఘనత సాధించామని అన్నారు. ఇంకా ఎకనామిక్ జోన్స్‌కు మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం పీఎం గతి శక్తి - నేషనల్ మాస్టర్ ప్లాన్‌ను కూడా క్యాబినెట్ ఆమోదించింది. మల్టీ మోడల్ కనెక్టివిటీ కోసం 100 లక్షల కోట్ల జాతీయ మాస్టర్ ప్లాన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన వారం రోజుల తర్వాత ఇది జరిగింది.