కర్ణాటకలో గుండెలు మెలిపెట్టే విషాదకర ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షం కారణంగా దక్షిణ కన్నడలో ఓ చోట కొండ చరియలు విరిగి ఓ ఇంటిపై పడ్డాయి. ఆ ఇంట్లోని ఇద్దరు చిన్నారి అక్కాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోయారు. వారిద్దరి మృతదేహాలు ఒకరి చేతిని మరొకరు పట్టుకుని ఉన్నట్టు వెలికిరావడం చాలా మందిని శోకంలో  ముంచేసింది. 

బెంగళూరు: కర్ణాటకలో ఓ విషాదం వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలో కురిసిన కుండపోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడలో ఈ కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఆరుగురు మరణించినట్టు పోలీసులు మంగళవారం వెల్లడించారు. ఉత్తర కన్నడలో హత్కల్ తాలూకలోని ముత్తల్లీలోని ఇంటిపై కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించారు. కాగా, దక్షిణ కన్నడలో మరింత బాధాకరమైన, హృదయవిదారక ఘటన జరిగింది.

దక్షిణ కన్నడలోని సుబ్రమణ్యలో కొండచరియలు విరిగి ఓ ఇంటిపై పడ్డాయి. ఆ ఇంటి శిథిలాల కింద కుసుమధార సంతానం శృతి (11), జ్ఞానశ్రీ (6)ల మృతదేహాలు వెలికి వచ్చాయి. ఒకరి చేతిని మరొకరు పట్టుకునే ఆ మృతదేహాలు వెలువడటం రెస్క్యూ టీమ్, కుటుంబ సభ్యులు, ఇతరుల మనసును మెలిపెట్టాయి.

సోమవారం సాయంత్రం సుబ్రమణ్యలో కుండపోతగా వర్షం పడింది. రాత్రి సుమారు 7 గంటల ప్రాంతంలో పెద్ద శబ్దం వచ్చింది. కొండ పక్కనే ఉన్న ఆ ఇంటి వెలుపల ఆడుకుంటున్న శృతి.. ఆ శబ్దం బహుశా ఇంటి లోపలి నుంచి వచ్చి ఉంటుందని భావించింది. వెంటనే ఇంటిలోకి పరుగెత్తింది. జ్ఞానశ్రీ కూడా ఇంటిలోకి ఉరికింది. అదే సమయంలో పక్కనే ఉన్న కొండ నుంచి కొన్ని చరియలు విరిగి ఆ ఇంటిపై పడ్డాయి. ఇదిలా ఉండగా, అదే ఇంటి కిచెన్‌లో బిజీగా ఉన్న తల్లి వెంటనే బయటకు వచ్చింది. పిల్లలు బయటే ఆడుతున్నారు కదా అనుకుని బయటకు పరుగున వచ్చింది. కానీ, వారు బయట లేరు. మళ్లీ ఇంటి లోపలికి వెళ్లే అవకాశం లేకపోయింది. అప్పటికే పరిస్థితులు చేజారిపోయాయి. ఇల్లు ధ్వంసం అయిపోయింది.

చెట్లు కూలిపోయి అక్కడ పడటం, నీరు కూడా వరదగా పారుతుండటంతో స్పాట్‌ను చేరుకోవడం రెస్క్యూ సిబ్బందికి చాలా కష్టమైంది. వర్షం కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను నెమ్మదింపజేస్తున్నదని పోలీసులు తెలిపారు.