భార్య ఆత్మహత్య చేసుకొని మృతి చెందగా...ఆమె అంత్యక్రియల నాడే.. భర్తను అతి దారుణంగా కొట్టి చంపేశారు. ఈ దారుణ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపురలో చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని.. అందుకే అతనిని కూడా చంపేశామని  మృతురాలి బంధువులు చెప్పడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే... విజయపుర ప్రాంతానికి చెందిన రాజుకి అదే ప్రాంతానికి చెందిన కాజల్ అనే యువతితో రెండేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లి జరిగిన నాటి నుంచి ఇద్దరి మధ్య ఏదో ఒక విషయంలో గొడవ జరుగుతూనే ఉంది. ఆ గొడవలు ఈ మధ్యకాలంలో మరింత తీవ్రరూపం దాల్చాయి. దీంతో వారిద్దిరీ ఇరు కుటుంబాల పెద్దలు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఇదిలా ఉండగా.. కాజల్ సడెన్ గా ఆత్మహత్య చేసుకొని మృతి చెందింది. అంతిమ సంస్కారాల కోసం ఆమె మృతదేహాన్ని పుట్టింటికి తరలించారు. భార్య అంత్యక్రియల్లో పాల్గొనడానికి వచ్చిన రాజు పై ఆమె బంధువులు కర్రలతో దాడి చేశారు. కాజల్ చనిపోవడానికి కారణం నువ్వే అని ఆరోపిస్తూ.. చితకబాదారు.

ఆ దెబ్బలు తట్టుకోలేక రాజు కూడా అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.