ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తన జీవితంలో చోటుచేసుకున్న సంచలన విషయాలను వెల్లడించారు. తాను చిన్నతనంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని మీడియాకు తెలిపారు.
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తన జీవితంలో చోటుచేసుకున్న సంచలన విషయాలను వెల్లడించారు. తాను చిన్నతనంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని మీడియాకు తెలిపారు. చిన్నతనంలో తన తండ్రి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించారు. తనను కొట్టేవాడని కూడా చెప్పారు. మహిళా కమిషన్ నిర్వహించిన అవార్డు కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా స్వాతి మలివాల్ మీడియాతో మాట్లాడుతూ.. అవార్డు గ్రహీతల పోరాట కథలు తన సొంత పోరాటాన్ని గుర్తుచేశాయని అన్నారు. ‘‘చిన్నతనంలో మా నాన్న నన్ను లైంగికంగా వేధించాడు. మా నాన్న నన్ను చాలా కొట్టేవారు.. ఇంటికి రాగానే మంచం కింద దాక్కొనేదానిని.. నాకు చాలా భయంగా ఉండేది.. ఆ సమయంలో ఇలాంటి అఘాయిత్యాలకు వ్యతిరేకంగా ఆడవాళ్లకు ఎలా సాధికారత కల్పించాలా అని రాత్రంతా ఆలోచించేదానిని.
నా వెంట్రుకలను పట్టుకుని.. నా తలను గోడకు బలంగా కొట్టేవాడు. కానీ అది మహిళల సంక్షేమం కోసం పని చేయాలనే దృఢ సంకల్పం నాలో కల్పించింది’’ అని స్వాతి మలివాల్ పేర్కొన్నారు. తన తండ్రి వద్ద తాను నాలుగో తరగతి వరకు ఉన్నానని చెప్పారు. ఇదిలా ఉంటే.. ఇటీవల సినీ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ సుందర్ కూడా.. ఎనిమిదేళ్ల వయసులో తన తండ్రి ద్వారా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టుగా తెలిపారు.
ఇక, 2015లో స్వాతి మలివాల్ ఢిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అయ్యారు. తర్వాత ఆమె పదవీకాలాన్ని పొడిగించారు. డీసీడబ్ల్యూ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు.. ఆమె ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సలహాదారుగా పనిచేశారు. స్వాతి మలివాల్ హర్యానా ఆప్ మాజీ చీఫ్ నవీన్ జైహింద్‌ను వివాహం చేసుకున్నారు. వారు 2020లో విడాకులు తీసుకున్నారు.
మహిళలపై అఘాయిత్యాలకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో మలివాల్ గొంతు వినిపిస్తుంటారు. ఈ ఏడాది జనవరిలో ఢిల్లీలో మహిళలపై నేరాల వరుస సంఘటనల తర్వాత.. మలివాల్ ఢిల్లీలో రాత్రి భద్రతా పరిస్థితిని పరిశీలించేందుకు రంగంలోకి దిగారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న క్యాబ్ డ్రైవర్.. ఆమె చేతిని కారు కిటికీలో లాక్ చేసి ఈడ్చుకెళ్లాడు. అయితే ఈ ఘటన నుంచి ఆమె సురక్షితంగా బయటపడగా.. తాను భయానక అనుభవాన్ని ఎదుర్కొన్నట్టుగా చెప్పారు.
