అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం, అతని కుటుంబ సభ్యులకు చెందిన ఆస్తులను కేంద్ర ప్రభుత్వం గురువారం వేలం వేసింది. ముంబయిలోని పాక్‌మోడియా వీధిలో ఉన్న దావూద్‌ ఆస్తులను ఈ సందర్భంగా వేలంలో పెట్టింది. మధ్య ముంబయిలోని బెహెండీ బజార్‌లో ఉన్న మసుల్లా బిల్డింగ్‌ ప్రారంభ ధరను రూ.79.43లక్షలుగా నిర్ణయించింది. కాగా.. అనూహ్యంగా ఈ బిల్డింగ్ రూ.3.5కోట్లు ధర పలికింది.

స్మగ్లర్లు, ఫారెన్‌ ఎక్స్ఛేంజ్‌ మ్యానిప్యులేటర్స్‌ చట్టం కింద టెండర్లను ఆహ్వానించారు. ఆగస్టు9 వ తేదీ ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఈ వేలం కొనసాగింది. కాగా.. ముసుల్లా బిల్డింగ్ ని  ఎస్బీయూటీ( సైఫీ బుర్హానీ అప్ లిఫ్ట్ మెంట్ ట్రస్ట్( రూ.3.5కోట్లకు అత్యధికంగా బిడ్ వేసి దక్కించుకుంది. 

ఎస్బీయూటీతోపాటు మరో రెండు సంస్థలు వేలంపాటలో పాల్గొన్నాయి. అయితే ఇందులో ఒక సంస్థ యజమాని.. వేలానికి ముందు చెల్లించాల్సిన రూ.25లక్షలను డిపాజిట్ చేయలేదు. దీంతో.. వేలంపాటలో బిల్డింగ్ ని దక్కించుకోలేకపోయారు.
 
గతేడాది నిర్వహించి వేలంలో సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్‌ ట్రస్ట్‌ అత్యధికంగా రూ.11.50కోట్ల బిడ్‌ వేసి దావూద్‌కు చెందిన కొన్ని ఆస్తులను దక్కించుకుంది. ఇప్పుడు కూడా అదే సంస్థ బిల్డింగ్ ని దక్కించుకోవడం గమనార్హం.