ముంబై:అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పూర్వీకుల ఆస్తిని ఈ ఏడాది నవంబర్ 10వ తేదీన విక్రయించనున్నారు.ఖేడ్ తాలుకాలోని రత్నగిరి జిల్లాలోని కొంకన్ గ్రామంలో ఈ ఆస్తులున్నాయి.స్మగ్లర్స్, ఫారిన్ ఎక్స్చేంజ్ మానిప్యులేటర్ యాక్ట్ (ఎస్ఏఎఫ్ఎంఏ) కింద వేలం వేయనున్నారు.

దావూద్ అనుచరుడు ఇక్బాల్ మిర్చికి చెందిన ఆస్తులను కూడ అదే రోజున విక్రయించనున్నారు. రత్నగిరి జిల్లాలోని ఖేడ్ తాలూకాలోని ముంబ్కే గ్రామంలో దావూద్ పూర్వీకులు ఉండేవారు. ఈ గ్రామంతో పాటు అనేక ప్రాంతాల్లో దావూద్ కు స్థిరాస్తులున్నాయి. 

ఇక్కడ ఉన్న బంగ్లాలోనే 1980లలో దావూద్ కుటుంబసభ్యులు నివాసం ఉండేవారు. ఈ భవనాన్ని విలాసవంతంగా మార్చి తన తల్లి పేరు మీద రాయించాడు. 1993లో ముంబైలో బాంబు పేలుళ్ల తర్వాత ఈ బంగ్లాను దావూద్ కుటుంబసభ్యులు ఖాళీ చేశారు. 

అప్పటి నుండి ఈ భవనం ఖాళీగానే ఉంది. ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థలో ఉంది.గత ఏడాదే ఈ ఆస్తుల విలువను నిర్ధారించారు. వీడియో కాన్పరెన్స్ ద్వారా ఈ ఆస్తులను విక్రయించనున్నారు. ఇదిలా ఉంటే 1993 బాంబు పేలుళ్ల తర్వాత దావూద్ ఇబ్రహీం ముంబై ని విడిచి వెళ్లాడు. దావూద్ కోసం భారత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.దావూద్ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవలనే మాట మార్చిన విషయం తెలిసిందే.