ఫేస్ బుక్ లో పరిచయం అయిన ప్రియుడి కోసం.. కన్న తల్లినే దారుణంగా హత్య చేయించింది ఓ కూతురు. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.  

పూర్తి వివరాల్లోకి వెళితే...  తిరువల్లూరు జిల్లాలోని కాక్కళూరుకు చెందిన దేవీప్రియకు ఇటీవల  కుంభకోణం  ప్రాంతానికి చెందిన వివేక్‌  అనే యువకుడు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమయ్యాడు.  ఈ పరిచయం కొద్ది రోజులకు ప్రేమగా మారింది.

 పెళ్లి కూడా చేసుకోవాలని  నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన ఇంట్లోని బంగారు నగలు తీసుకొని ప్రియుడితో కలిసి పారిపోవడానికి దేవీప్రియ స్కెచ్ వేసింది. కాగా... కూతురు దేవీప్రియ తీరు గమనించిన తల్లి భానుమతి ఆమెను అడ్డుకుంది.

 దీంతో ఆ యువతి తనను తీసుకెళ్లేందుకు వచ్చిన ప్రియుడు వివేక్, అతని స్నేహితుల సహాయంతో తల్లిని దారుణంగా హత్య చేయించింది. గమనించిన స్థానికులు  వివేక్, అతని ఇద్దరు స్నేహితులను  పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన యువతి తల్లిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు.