భర్త చనిపోయినా.. బిడ్డల కోసమే బతికింది ఆ తల్లి. తాను కష్టపడి.. బిడ్డలను పెంచి పెద్ద చేసింది. తీరా కొడుకు మంచి పొజిషన్ కి చేరుకోగానే.. కన్న తల్లిని ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో అనాథగా మారిన ఆ తల్లికి కూతుళ్లు అండగా నిలిచారు. తన తల్లికి మరోసారి వివాహం చేసి కొత్త జీవితాన్ని అందజేశారు. ఈ సంఘటన మీరట్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..మీరఠ్‌లోని జాగృతి విహార్‌కు చెందిన ఒక మహిళ‌కు భర్త చనిపోయి 15 ఏళ్లు అయ్యింది. తన కాయకష్టంతో ఆమె తన పిల్లలను పెంచిపెద్దచేసింది. కుమార్తెలకు ఘనంగా వివాహం జరిపించింది. అయితే కొడుకు చెడు అలవాట్లకు లోనయ్యాడు. తల్లిని కొడుతుండేవాడు. ఒకరోజు కన్నతల్లిని బయటకు గెంటేశాడు. దీంతో ఆమె కుమార్తెలే ఆమెకు ఆశ్రయం కల్పించారు. తరువాత వారు తల్లికి తగిన వరుని కోసం వెదికారు. చివరికి సుహారన్‌పూర్ నివాసి, వారి బంధువు అయిన వ్యక్తితో తల్లికి వివాహం జరిపించారు. ఆయనకు పెళ్లయినప్పటికీ భార్య చనిపోవడంతో ఈ వివాహానికి అంగీకరించాడు. ఈ ఉదంతం తెలిసినవారంతా ఆ కుమార్తెలను అభినందనలతో ముంచెత్తుతున్నారు.