కంటే కూతుర్నే కనాలి.. అనేది ఈ వృద్ధ దంపతుల విషయంలో విషంగా మారింది. కూతురూ కొడుకులకు ఏమీ తీసిపోనని నిరూపించింది. వృద్ధ తల్లిదండ్రులనే కనికరం కూడా లేకుండా ఆస్తికోసం కాల్చుకుతింటోంది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
మధ్యప్రదేశ్ : ఆడపిల్ల ఉంటే అక్కున చేర్చుకుంటుంది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకుంటుంది. ప్రేమగా ఉంటుంది. ఇది తల్లిదండ్రులు నమ్మే వాస్తవం. అయితే కొన్నిసార్లు ఆడపిల్లలూ మగపిల్లలకు ఏమీ తీసిపోరు. వారిలాగే తల్లిదండ్రులకు చుక్కలు చూపిస్తారు. డబ్బుల కోసం పీల్చుకుతింటారు. అంతేనా.. శతాధిక వృద్ధులని కూడా చూడకుండా చంపుతానని బెదిరిస్తూ ఆస్తి కాజేయడానికి ప్రయత్నిస్తారు. ఇదిగో అలాంటి ఓ కూతురు మీద వందేళ్లు దాటిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అతని వయసు 103 సంవత్సరాలు, అతని భార్య వయస్సు 95 ఏళ్లు. 75 ఏళ్ల వైవాహిక జీవితం వారిది. ఒక్కగానొక్క కూతుర్ని గారాబంగా పెంచారు. పెద్దయ్యాక తమకు కొండంత అండగా నిలుస్తుందని అనుకున్నారు. ఆమెకు చక్కగా పెళ్లి చేసి పంపించారు. వీలైనప్పుడల్లా కావాల్సినంత పెడుతున్నారు. అయితే ఆ కూతురికి వీరొక డబ్బు యంత్రాళ్లా మాత్రమే కనిపించారు. ఆమె కూడా కొడుకులకు ఏమాత్రం తీసిపోనని నిరూపించింది. దీంతో చివరి దశలో ఉన్న తల్లిదండ్రులకు నరకం చూపిస్తుంది. ఆస్తికోసం వేధింపులకు గురి చేస్తుంది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో రాయి కాలనీకి చెందిన నారాయణ (103), విమల( 95) దంపతులు తాజాగా జిల్లా ఎస్పీ ఆఫీస్ కి వెళ్లి తమ కూతురిపై ఫిర్యాదు చేశారు. ‘మాకు కొంత వ్యవసాయ భూమి, అద్దె వచ్చే ఇల్లు ఉంది. వాటి నుంచి వచ్చే రాబడి మాకు అందకుండా కూతురు లాగేసుకుంటుంది. మాకు కనీస అవసరాలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. అడిగితే భౌతికంగా, మానసికంగా వేధిస్తోంది. చంపేస్తానని బెదిరిస్తుంది. బూతులు తిడుతూ ఉంది. దయచేసి మా కూతురు నుంచి మమ్మల్ని కాపాడండి’ అని ఆ వృద్ధ దంపతులు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. ఆ వృద్ధ దంపతులకు తోడుగా మనవళ్లు కూడా పోలీస్ స్టేషన్ కు రావడం విశేషం, తమ అమ్మ తమను కూడా టార్చర్ పెడుతోందని వారు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.
