గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు దక్షిణాది రాష్ట్రాలతోపాటు మహారాష్ట్ర విలవిల్లాడుతున్నాయి. చాలా చోట్ల జనజీవనం స్థంభించింది. కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా లభించడం లేదు.

 కేరళలో వరదలతో గత మూడు రోజుల్లో 35 మంది చనిపోగా మలప్పురం, వయనాడ్‌ జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడిన రెండు ఘటనల్లో సుమారు 40 మంది శిథిలాల్లో చిక్కుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలు 25 వరకు నమోదయ్యాయి. కర్ణాటకలోనూ ఇంచు మించు ఇదే పరిస్థితి. అన్నిచోట్ల అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు సహాయక చర్యలు చేపడుతున్నారు.

కాగా... హిమాచల్ రాష్ట్ర ముఖ్యమంత్రి టాకూర్ కుమార్తె అవంతిక వరదల్లో చిక్కుకున్నారు. ఉడిపి జిల్లా మణిపాల్ వర్శిటీలో ఆర్కిటెక్చర్ ఇంజినీరింగ్ చదువుతున్న అవంతిక స్నేహితులతో కలిసి బాదామికి బయలుదేరారు. వీరి బస్సు మలప్రభ నది వరదలో చిక్కుకుంది. దీంతో అవంతిక, ఆమె స్నేహితులు బస్సు దిగి వరద నీటిలోనే ముందుకు వెళ్లారు. హోసూరు గ్రామస్థులు వారికి ఆశ్రయం కల్పించారు. కాగా... వారిని సురక్షితంగా వారి ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.