బోపాల్: కన్న తల్లిపై ప్రేమతో కన్న తండ్రిని అతి దారుణంగా హతమార్చిందో యువతి. మద్యానికి బానిసయిన తండ్రి కుటుంబానికి బారంగా మారడమే కాకుండా తల్లిని చిత్రహింసలు పెడుతుండటాన్ని చూసి భరించలేక యువతి ఈ హత్యకు పాల్పడింది. మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఈ  ఘటన చోటుచేసుకుంది. 

స్థానిక పోలీసుల కథనం ప్రకారం... భోపాల్ లో నివాసముండే ఓ వ్యక్తి(45) మద్యానికి బానిసై నిత్యం కుటుంబాన్ని వేధించేవాడు. కొడుకు సంపాదనతో తాగుతూ నిత్యం భార్యను చితకబాదుతూ హింసించేవాడు. దీంతో అతడిపై కూతురు ద్వేషాన్ని పెంచుకుంది. 

ఈ క్రమంలోనే బుధవారం సాయంత్రం కుటుంబం మొత్తం ఇంట్లోనే వుండగా అతడు తాగొచ్చి రచ్చ చేశాడు. తల్లీ, కొడుకు అతన్ని సముదాయించే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో యువతికి కోపం కట్టలు తెంచుకుని తండ్రిపై కర్రతో దాడికి పాల్పడింది. ఈ దాడిలో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. 

అనంతరం యువతే స్వయంగా పోలీసులకు ఫోన్ చేసి తండ్రిని చంపినట్లు సమాచారం ఇచ్చింది. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టమార్టం నిమిత్తం తరలించి యువతిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.