ఈ మధ్యకాలంలో యువత డేటింగ్ యాప్ ల మాయలోపడి ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. మన ప్రొఫైల్ కి నచ్చిన వ్యక్తి ఎవరున్నారా అంటూ గంటలకొద్దీ అందులో వెతికుతున్నారు. వాటిల్లో పరిచయం పెంచుకొని చివరకు మోసపోతున్నారు. ఇలాంటి సంఘటనే మరోటి చోటుచేసుకుంది.ఓ యువతి డేటింగ్ యాప్ లో పరిచయం అయిన ఓ వ్యక్తితో డేటింగ్ కి వెళ్లి చిక్కుల్లో పడింది. ఈ సంఘటన ముంబయిలో చోటుచేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మంబయికి చెందిన ఓ యువతికి ఇటీవల ఓ డేటింగ్ యాప్ ద్వారా ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అతని ప్రొఫైల్ నచ్చడంతో.. ఆమె అతనితో చాటింగ్ చేసింది. ఇద్దరూ రోజూ ఫోన్ లో గంటల కొద్దీ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కాగా.. ఇటీవల సదరు యువకుడు.. బయట కలుద్దామంటూ యువతికి ప్రపోజల్ పెట్టాడు.

రోజూ ఫోన్ లో హుందాగా మాట్లాడుతుండటంతో.. సదరు యువతి కూడా అతని ప్రపోజల్ కాదనలేకపోయింది. ఇద్దరూ మార్చి 13వ తేదీన చెంబూర్ లో కలుసుకున్నారు. అక్కడ కాసేపు ముచ్చట్టాడుకున్న తర్వాత.. మరో పబ్ కి వెళదామని యువకుడు ఆమెను కోరాడు. యువతి కూడా సరేనంది. ఇద్దరూ కలిసి బాంద్రాలోని ఓ పబ్ కి వెళ్లారు.

అప్పటికే రాత్రి 11దాటింది సమయం. ఆ పబ్ లో యువకుడు మద్యం తాగడం మొదలుపెట్టాడు. ఆ మద్యం మత్తు తలకి ఎక్కగానే సదరు యువతితో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. అతని పనికి విస్తుపోయిన యువతి.. ఇంటికి వెళదామని అడిగింది. సరేనని కారు ఎక్కించుకున్న యువకుడు.. కారులో బలవంతంగా ఆమెను తాకడం, ముద్దుపెట్టుకోవడం లాంటివి చేశాడు.

ఆమె దుస్తులు తొలగించడానికి కూడా ప్రయత్నించాడు. దీంతో.. యువతి అతని నుంచి తప్పించుకునేందుకు బలవంతంగా కారు డోర్ తీసి బయటకు పరగులు తీసింది. కాగా.. సదరు యువకుడు కారులో యువతిని వెంబడించడం మొదలుపెట్టాడు. అదృష్టవశాత్తు యువతికి అదే సమయంలో ఆ ప్రాంతంలో పోలీసులు కనిపించారు. దీంతో.. వెంటనే ఆమె వారిని ఆశ్రయించింది. 

ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకన్న పోలీసులు సదరు నిందితుడిని అరెస్టు చేశారు. సమయానికి అక్కడ పోలీసులకు లేకపోయినా.. యువతి జీవితం నాశనమయ్యేది. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని పోలీసులు చెప్పారు.