మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మైసూరు రాజవంశానికి చెందిన యదువీర్ కృష్ణదత్ చామరాజ ఒడయార్ శమీ వృక్షానికి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.

మధ్యాహ్నం మకరలగ్నంలో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప చాముండేశ్వరి అమ్మవారికి పూజలు నిర్వహించి.. 409వ జంబూ సవారీని ప్రారంభించారు. అమ్మవారి ఊరేగింపును వీక్షించేందుకు సందర్శకులు మైసూరుకు భారీగా తరలివచ్చారు.

దాదాపు వందకు పైగా కళాబృందాలు ప్రదర్శించిన కళారీతులు ప్రజలను ఆకర్షించాయి. కాగా ఊరేగింపు సందర్భంగా ఎలాంటి అవాంచనీయమైన సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

మైసూరు రాజవంశీకులు 1610వ సంవత్సరంలో దసరా వేడుకలను ప్రారంభించారు. రాజధానిని శ్రీరంగపట్నం నుంచి మైసూరుకు మార్చినందుకు గుర్తుగా దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారని చరిత్రకారులు చెబుతున్నారు.