ఇండోర్ డ్యాన్సింగ్ ట్రాఫిక్ కానిస్టేబుల్ చాలా మందికి సుపరిచితుడే. ఆయన తన స్టెప్పులతో ట్రాఫిక్‌ను హ్యాండల్ చేయడం కట్టిపడేస్తుంది. ఈ సారి ఆయన తన క్రియేటివిటికి కాకుండా.. పేద పిల్లలకు చేసిన సహకారంగా కారణంగా వార్తల్లో నిలిచాడు. ఎండలతో మండుతున్న రోడ్డును చెప్పుల్లేకుండా క్రాస్ చేయాలని ప్రయత్నించిన పిల్లలకు ఆయన బాసటగా నిలిచాడు.
ఇండోర్: మధ్యప్రదేశ్‌లో ట్రాఫిక్ కానిస్టేబుల్ రంజీత్ సింగ్ చాలా ఫేమస్. ఆయన ట్రాఫిక్‌ను సృజనాత్మకంగా మేనేజ్ చేస్తుంటాడు. మైఖేల్ జాక్స్ స్టెప్‌లతో వెహికిల్స్‌కు సిగ్నల్స్ ఇస్తుంటాడు. సరికొత్త విధానంతో ట్రాఫిక్ సిగ్నల్ ఇస్తుండటం రంజీత్ సింగ్‌ను చాలా పాపులర్ చేసింది. ఈ ఇండోర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ దేశమంతటా తెలిసిపోయారు. ఎన్నో అవార్డులు వరించాయి. తొలుత ఆయన స్టెప్‌లు సహోద్యోగులకు ఎబ్బెట్టుగా అనిపించినా.. ఇప్పుడు ఆయనే ఇతర ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు తన స్టైల్‌పై శిక్షణ ఇస్తున్నాడు. తాజాగా, ఆయన మరోసారి దేశ వార్తల్లోకి ఎక్కాడు. ఈ సారి ట్రాఫిక్ సిగ్నల్స్ కారణంగా కాదు.. ఇద్దరు పేద చిన్నారులకు అండగా నిలబడిన దృశ్యాలు ఆయనలోని మానవత్వాన్ని దేశానికి పరిచయం చేశాయి.
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు.. చెత్త ఏరుకునే ఇద్దరు పిల్లలు ఆయనకు సమీపంగా వచ్చారు. ఎండ దంచి కొడుతున్నది. హైకర్టు దగ్గర ట్రాఫిక్ చాలా బిజీగా ఉన్నది. ఆ పిల్లలు ఇద్దరూ ట్రాఫిక్ నుంచి ఈది అటువైపుగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, బిజీ ఏరియా కాబట్టి, అంత సులువుగా రోడ్డు దాటలేక వెయిట్ చేస్తున్నారు. కానీ, ఆ ఎండల దాటికి రోడ్డు కూడా సెగలు కక్కుతున్నది. ఈ రోడ్డుపై చెప్పులు లేకుండా ఆ పిల్లాడి నిలబడటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది ట్రాఫిక్ కానిస్టేబుల్ రంజీత్ సింగ్ కంట పడింది.
ఆ పిల్లాడు కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్ రంజీత్ సింగ్ దగ్గరకు వెళ్లి.. సర్.. నా కాళ్లు మండిపోతున్నాయ్ అంటూ వేదనగా అడిగాడు. ఆ దృశ్యం రంజీత్ సింగ్‌ను కదిలించింది. వెంటనే తన దగ్గరకు రమ్మన్నాడు. తన కాళ్లపై ఆ పిల్లాడిని రెండు కాళ్లు వేసి నిలబడమని సూచించాడు. తద్వార నేరుగా రోడ్డుపై నిలబడకపోవడం మూలంగా ఆ వేడి నుంచి పిల్లాడి కాళ్లు ఉపశమనం పొందాయి. ట్రాఫిక్ క్లియర్ కాగానే ఆ చిన్నారులను రోడ్డు దాటించాడు. వారికి స్లిప్పర్లు కూడా కొనిచ్చాడు.
ఈ దృశ్యాలను కెమెరాలో బంధించారు. ఆ చిత్రాలనే ఈ డ్యాన్సింగ్ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్టు చేశారు. ఈ ఫొటోలతో తన వ్యాఖ్యనూ జోడించారు. ఈ పిల్లలు వారి కాళ్లను తన కాళ్లపై పెట్టినప్పుడు దేవుడే ఆయన కాళ్లను తనపై పెట్టినట్టుగా ఫీల్ అయినట్టు పేర్కొన్నాడు. ఆ పిల్లలకు తాను చెప్పులు కొనిచ్చాడని వివరించాడు. తన హృదయంలో ఎప్పటికీ పదిలంగా మిగిలిపోయే జ్ఞాపకాల్లో ఇదీ కచ్చితంగా ఉంటుందని తెలిపాడు.
