ఉత్తరప్రదేశ్‌లో దళితుడిని ఓ ఊరి పెద్ద చెప్పుతో కొట్టిన ఘటన కలకలం రేపుతున్నది. ఇద్దరు వ్యక్తులు దళిత యువకుడిపై దాడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.

లక్నో: దళితుల అఘాయిత్యాలు తగ్గడం లేదు. రాజస్తాన్‌లో బాలుడిపై దాడిని మరువక ముందే మరో అభ్యంతరకర ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో చోటుచేసుకుంది. దళిత యువకుడిని ఊరి పెద్ద చెప్పుతో కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఒకరిని అరెస్టు చేసినట్టు పోలీసులు శనివారం తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం దళిత యువకుడు దినేశ్ కుమార్ (27)ను ఇంటికి పిలిచారు. తాజ్‌పూర్ గ్రామ పెద్ద శక్తి మోహన్ గుర్జార్ ముందుకు దినేశ్ కుమార్ వెళ్లాడు. కుర్చీలో కూర్చున్న శక్తి మోహన్ గుర్జార్... దినేశ్ కుమార్‌ను కింద కూర్చోమని సైగ చేశాడు. చేతులు కట్టుకుని ఆయన ముందు కూర్చున్న దినేశ్ కుమార్‌ను ఆ ఊరి పెద్ద శక్తి మోహన్ గుర్జార్ చేతులతో కొట్టాడు. ఆ తర్వాత చెప్పుతో కొట్టాడు. ఇంతలో మరో వ్యక్తి కలుగజేసుకున్నాడు. దినేశ్ కుమార్‌ను అక్కడి నుంచి లేపి ఆయన కూడా కొట్టాడు. ఇద్దరూ కొట్టిన తర్వాత దినేశ్ కుమార్‌ను అక్కడి నుంచి పంపిచేశారు. గేటు దగ్గర విడిచిన చెప్పులు వేసుకుని బయటకు వెళ్లిపోతున్నట్టుగా ఆ వీడియోలో దినేశ్ కుమార్ కనిపించాడు. ఈ దాడి జరుగుతుండగా అక్కడ ఇతరులూ ఉన్నారు. బహుశా అది ఆ ఊరి పెద్ద ఇల్లుగా కొందరు చెబుతున్నారు.

Scroll to load tweet…

తాజ్‌పూర్ గ్రామ పెద్ద శక్తి మోహన్ గుర్జార్, రేతా నాగ్లా గ్రామ మాజీ పెద్ద గాజే సింగ్‌లు దినేశ్ కుమార్‌పై దాడి చేసినట్టు పోలీసులు తెలిపారు. చెప్పుతో కొట్టడమే కాదు.. చంపేస్తామనీ బెదిరించినట్టు వివరించారు.

సిటీ ఎస్పీ అర్పిత్ విజయవర్గీయ ఈ విషయం పై విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ ఎస్టీలపై అఘాయిత్యాల నిరోధక చట్టం కింద వారిద్దరి పైనా కేసు నమోదైనట్టు తెలిపారు. గ్రామ పెద్ద శక్తి మోహన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలింపులు జరుగుతున్నాయి. 

ఇదిలా ఉండగా, భీమ్ ఆర్మీ కార్యకర్తలు దళిత కమ్యూనిటీ సభ్యులతో కలిసి ఛాపర్ పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. నిందితులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఏరియాలో పోలీసులు భద్రతను రెట్టించారు.