ఐఐటీ బాంబేలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న దర్శన్ సోలంకి ఫిబ్రవరి 12వ తేదీన ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దర్శన్ సోలంకి ఆత్మహత్యకు కుల వివక్షనే కారణమని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఐఐటీ బాంబేలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న దర్శన్ సోలంకి ఫిబ్రవరి 12వ తేదీన ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దర్శన్ సోలంకి ఆత్మహత్యకు కుల వివక్షనే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఐఐటీ బాంబే అధికారులు ఖండించారు. క్యాంపస్‌లో ఎలాంటి వివక్ష లేదని వారు తెలిపారు. మరోవైపు కులం కారణంగా స్నేహితులు బహిష్కరించడం దర్శన్ ఆత్మహత్య చేసుకున్నారని అతని కుటుంబ సభ్యులు సైతం ఆరోపిస్తున్నారు. ఓ ఆంగ్ల మీడియా సంస్థతో దర్శన్ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు.
‘‘గత నెలలో అతను (దర్శన్) వచ్చినప్పుడు.. అక్కడ కుల వివక్ష జరుగుతోందని నాకు, అమ్మ-నాన్నలకు చెప్పాడు. దర్శన్ షెడ్యూల్డ్ కులానికి చెందినవాడని అతని స్నేహితులకు తెలుసు. దీంతో అతని పట్ల వారి ప్రవర్తన మారిపోయింది. వారు అతనితో మాట్లాడటం మానేశారు. వారు అతనితో తిరగడం మానేశారు’’ అని దర్శన్ సోదరి జాన్వీ సోలంకి అన్నారు. ‘‘అతను బాధలో ఉన్నాడు. అతను హింసించబడ్డాడు. అందుకే అతను ఇలా చేసాడు’’ అని అతని తల్లి తర్లికాబెన్ సోలంకి చెప్పారు.
Also Read: బాంబే ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య... ఏడంతస్తుల హాస్టల్ భవనంపై నుంచి దూకి..
దర్శన్ అత్త దివ్యాబెన్ మాట్లాడుతూ.. ‘‘నెల రోజుల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు తాను ఉచితంగా చదువుతున్నానంటే చాలా మంది విద్యార్థులు ఇష్టపడరని అతను చెప్పాడు. జనాలు అసూయతో.. ‘మేం చాలా డబ్బులు ఖర్చుచేస్తుంటే నువ్వు ఉచితంగా ఎందుకు చుదవుతున్నావు’ అని అడిగేవారని అతడు నాకు చెప్పాడు. కొంతమంది స్నేహితులు కూడా తనతో మాట్లాడటం మానేశారని కూడా చెప్పాడు’’ అని తెలిపారు.
దర్శన్ చనిపోవడానికి కొన్ని గంటల ముందు తాను అతడితో మాట్లాడినట్లు దర్శన్ తండ్రి రమేష్ భాయ్ సోలంకి తెలిపారు. ‘‘దర్శన్ ఆత్మహత్యకు రెండు గంటల ముందు మాకు ఐఐటి నుండి కాల్ వచ్చింది. అతను సాధారణంగా మాట్లాడుతున్నాడు. 'ఎలా ఉన్నావు' అని నన్ను అడిగాడు. అతను మా అన్నయ్య కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి కాల్ చేశారు. అతను ఆ రోజు బయటకు వెళ్తానని చెప్పాడు. నేను కొంత డబ్బు పంపాను. అతని అకౌంట్‌కి.. 'నా దగ్గర డబ్బు ఉంది, నాకు డబ్బు అవసరం లేదు' అని అన్నాడు. అతను పెద్దగా ఖర్చు చేయడం లేదు. కానీ నేను కొంత డబ్బు పంపుతున్నాను. ఇంతలోనే ఇలా జరుగుతుందని నాకు తెలియదు’’ అని రమేష్ వాపోయారు.
దర్శన్ సోలంకి వ్యవస్థీకృత వివక్షను ఎదుర్కొన్నాడన్న ఆరోపణలను ఐఐటీ బాంబే తోసిపుచ్చింది మరియు అతని మరణంపై దర్యాప్తు జరుగుతోందని తెలిపింది. ఇక, ఐఐటీ బాంబేలో చదువుతున్న దర్శన్.. ఆదివారం హాస్టల్ భవనంలోని ఏడో అంతస్తు నుంచి దూకి మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ప్రమాదవశాత్తు మృతి చెందారని కేసు నమోదు చేశారు. తమకు ఇంకా సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు. అయితే క్యాంపస్‌లో దళిత విద్యార్థులపై వివక్ష చూపడం వల్లే దర్శన్ ఆత్మహత్యకు పాల్పడ్డారని విద్యార్థి సంఘం ఆరోపిస్తోంది.
