Asianet News TeluguAsianet News Telugu

అగ్రవర్ణ మహిళను పెళ్లి చేసుకున్న దళిత వ్యక్తిని హత్య చేసిన అత్తమామలు..

అగ్రవర్ణ మహిళను పెళ్లి చేసుకున్న దళిత వ్యక్తిని అత్తమామలు హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో చోటుచేసుకుంది. 

Dalit man killed by in laws for marrying upper caste woman in Uttarakhand Almora district
Author
First Published Sep 3, 2022, 9:26 AM IST

అగ్రవర్ణ మహిళను పెళ్లి చేసుకున్న దళిత వ్యక్తిని అత్తమామలు హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలో చోటుచేసుకుంది. ఉన్నత కులానికి చెందిన మహిళను వివాహం చేసుకున్నందుకు దళిత వ్యక్తిని అతని అత్తమామలు హత్య చేశారని శుక్రవారం ఒక అధికారి తెలిపారు. వివరాలు.. పనుఅధోఖాన్ గ్రామానికి చెందిన దళిత రాజకీయ కార్యకర్త జగదీష్ చంద్ర శుక్రవారం భికియాసైన్ పట్టణంలో కారులో శవమై కనిపించినట్లు సల్ట్ సబ్ డివిజన్ తహసీల్దార్ నిషా రాణి తెలిపారు.

జగదీష్ చంద్ర శరీరంలో 25 గాయాలు ఉన్నాయని తెలుస్తోంది. జగదీష్ చంద్ర భార్య తల్లి, ఆమె సవతి తండ్రి, సవతి సోదరుడు.. అతడి మృతదేహాన్ని పారవేసేందుకు కారులో తీసుకెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారని రాణి చెప్పారు. వారిని వెంటనే అరెస్టు చేశామని వెల్లడించారు. జగదీష్ ఆగస్టు 21న అగ్రవర్ణ మహిళను వివాహం చేసుకున్నాడని చెప్పారు. జగదీష్‌ను అతని అత్తమామలు గురువారం శిలాపాని బ్రిడ్జి నుంచి కిడ్నాప్ చేశారని రాణి తెలిపారు.

ఇక, జగదీష్ 2021లో ఉత్తరాఖండ్ పరివర్తన్ పార్టీ అభ్యర్థిగా సల్ట్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఓడిపోయారు.

అయితే పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే తమ ప్రాణాలకు ముప్పు ఉందని.. భద్రత కల్పించాలని కోరుతూ జగదీష్ దంపతులు అధికారులకు లేఖరాసినట్టుగా ఉత్తరాఖండ్ పరివర్తన్ పార్టీ నాయకుడు పీసీ తివారీ తెలిపారు. వారి ఫిర్యాదుపై అధికారులు చర్యలు తీసుకుని ఉంటే జగదీష్ హత్య జరిగి ఉండకపోయేదన్నారు. ఈ హత్య ఉత్తరాఖండ్‌కు సిగ్గుచేటని పేర్కొన్నారు. బాధితుడి భార్యకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios