చెన్నైలోని ఎంజీఆర్ నగర్ స్టేషన్‌లో గురువారం శ్రీధర్ అనే 25 ఏళ్ల దళిత వ్యక్తిని పోలీసులు విచారణకు పిలిచిన కొన్ని గంటలకే మృతిచెందడం కలకలం రేపుతోంది. దీంతో నగర పోలీసులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడులో దారుణం జరిగింది. చెన్నైలోని ఎంజీఆర్ నగర్ స్టేషన్‌లో గురువారం శ్రీధర్ అనే 25 ఏళ్ల దళిత వ్యక్తిని పోలీసులు విచారణకు పిలిచిన కొన్ని గంటలకే మృతిచెందడం కలకలం రేపుతోంది. చెన్నై మున్సిపల్ కార్పోరేషన్‌లో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న శ్రీధర్‌కు జూలై 12, 13 తేదీల్లో పోలీసులు సమన్లు జారీ చేశారు. దీంతో గురువారం జూలై 13న శ్రీధర్ తన భార్య మంజుతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. మధ్యాహ్నం 12.30 గంటలకు విచారణకు వెళ్లి.. 1.15 గంటలకు వారిద్దరూ వెళ్లిపోయారు.
అయితే ఇంటికి తిరిగి వస్తుండగా శ్రీధర్‌కు ఛాతీ నొప్పి రావడంతో ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు శ్రీధర్ గ్యాస్ట్రిక్ ట్రబుల్‌తో బాధపడుతున్నారని నిర్ధారించారు. చికిత్స అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన శ్రీధర్ మూర్చపోయాడు. అతని నోటి వెంట వాంతులు, నురగలు వస్తుండటంతో భార్య మంజు హుటాహుటిన ఆసుపత్రికి తరలించింది. అతనిని పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు.
అనంతరం శ్రీధర్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఈ ఘటనపై ఐపీసీ సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసిన చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మూర్చలు రావడం వల్లే శ్రీధర్ ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు చెబుతున్నారు. అయితే గతేడాది డిసెంబర్‌లోనూ చెన్నైకి చెందిన 26 ఏళ్ల దినేష్ కుమార్ కూడా ఓ కేసు విషయమై కన్నగి నగర్ పోలీసుల ముందు హాజరై స్టేషన్ నుంచి బయటకొచ్చిన కొన్ని గంటలకే ప్రాణాలు కోల్పోయాడు. గతేడాది ఏప్రిల్‌లోనూ చెన్నైలోని మెరీనా బీచ్‌లో గుర్రపు స్వారీ చేస్తూ జీవించే 25 ఏళ్ల విఘ్నేష్ పోలీస్ కస్టడీలో వుండగానే ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో కలకలం రేపింది.
