ఎన్ని కఠిన చట్టాలు వస్తున్నా...ప్రభుత్వం ఎంతగా అవగాహన కల్పిస్తున్నా దళితులపై అగ్రవర్ణాల దాడులు ఆగడం లేదు. తాజాగా తలపాగా(టర్బన్) ధరించాడని ఓ దళిత నేత తలపై చర్మాన్ని అగ్రకులానికి చెందిన యువకులు ఒలిచేశారు.

మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురి జిల్లా మొహోబా గ్రామానికి చెందిన సర్దార్ సింగ్ జాదవ్ బీఎస్పీ దళిత నేత... ఇతను ఒక రోజు తలకు తలపాగా ధరించాడు. అయితే ఇది గుజ్జర్‌లకు మాత్రమే చెందిన సాంప్రదాయమని దళితులు ధరించరాదంటూ వారు జాదవ్‌పై కన్నెర్ర చేశారు.

ఈ నెల 3న సర్దార్ సింగ్‌ను ఓ విషయంపై మాట్లాడాలని కొందరు గుజ్జర్ యువకులు సురేంద్ర గుజ్జర్ అనే వ్యక్తి ఇంటికి పిలిచారు. అనంతరం యువకులంతా కలిసి అసభ్యపదజాలంతో గుజ్జర్‌ను దూషించడం ప్రారంభించారు. అక్కడితో ఆగకుండా పట్టరాని కోపంతో సర్దార్‌పై కత్తితో దాడి చేసి అతని తలపై చర్మాన్ని ఒలిచేశారు.

సర్దార్ ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉందని ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని పోలీసులు తెలిపారు.. దాడిలో తీవ్రంగా గాయపడిన సర్దార్‌కు ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు.