ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. స్వచ్చంధ సంస్ధలు ఎంతగా అవగాహన కలిగిస్తున్న ఇంకా దళితుల పట్ల చిన్న చూపు పోవడం లేదు. తాజాగా ఓ వ్యక్తి తన వివాహానికి గ్రామంలో గుర్రంపై ఊరేగినందుకు గాను అతడి సామాజిక వర్గాన్ని గ్రామపెద్దలు బహిష్కరించారు.

వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌లోని మహేసాణ జిల్లా కాది తాలూకా హ్లోర్ గ్రామానికి చెందిన మెహుల్ పరం అహ్మదాబాద్‌‌లోని ఓ ప్రైవేట్ సంస్ధలో పనిచేస్తున్నాడు. ఈ నెల 7న అతని పెళ్లి జరిగింది. ఈ సందర్భంగా గుర్రపు స్వారీ చేస్తూ తన బంధువులతో గ్రామంలో ఊరేగింపుగా వెళ్లాడు.

అయితే మెహుల్ దళితుడు కావడంతో గ్రామంలోని అగ్రవర్ణాలకు చెందిన కొందరు పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాతి రోజు వీరంతా సమావేశమై...  దళితులకు ఇలా గుర్రంపై ఊరేగే హక్కు లేదని, గ్రామ కట్టుబాట్లను మీరినందుకు గాను అతని సామాజిక వర్గాన్ని వెలివేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు.

వీరితో మాట్లాడిన వారికి, సాయం చేసిన వారికి రూ.5,000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. దీంతో గ్రామంలోని దుకాణదారులు కూడా ఆ సామాజికి వర్గానికి సరుకులు విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు.

చివరికి గ్రామంలోని బావి నుంచి కూడా నీళ్లు తీసుకోవడానికి గ్రామస్తులు అభ్యంతరం చెబుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామ సర్పంచి వినూజీ ఠాకూర్, ఉప సర్పంచి బల్దియో ఠాకూర్‌తో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.