Asianet News TeluguAsianet News Telugu

పెరుగు వివాదం: ప్యాకెట్ పై ‘దహి’ ప్రింట్ చేయాలన్న ఆదేశాలపై విమర్శలు.. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు ఉపసంహరణ

పెరుగు ప్యాకెట్లపై కర్డ్ అనే ఇంగ్లీష్ పదానికి బదులు దహి అనే హిందీ పదం ప్రింట్ చేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దక్షిణాది భాషలపై హిందీ భాషను రుద్దుతున్నారని విమర్శలు వచ్చాయి. దీంతో తాజాగా, ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలను ఉపసంహరించుకుంది.
 

dahi row: FSSAI revises its directives of print dahi instead of curd on sachets after hindi imposition backlash kms
Author
First Published Mar 30, 2023, 6:56 PM IST

న్యూఢిల్లీ: పెరుగు వివాదం దుమారం రేపింది. పెరుగు ప్యాకెట్ పై ఇంగ్లీష్ పదం కర్డ్‌(curd)ను తొలగించి హిందీ పదం ‘దహి’ ప్రింట్ చేయాలని ప్రభుత్వ డెయిరీ ప్రాడక్టుల తయారీదారులను ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆదేశించడం కలకలం రేపింది. ఈ ఆదేశాలతో తమ మాతృభాషను కాదని హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వ డెయిరీ ఉత్పత్తుల తయారీదారు ఆవిన్‌కు ఈ ఆదేశాలు రావడాన్ని తమిళులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో ఎఫ్ఎస్ఎస్ఏఐ తన ఆదేశాలను ఉపసంహరించుకుంది.

స్టాండర్డ్స్ ఆఫ్ ఫర్మంటెడ్ మిల్క్ ప్రాడక్ట్స్ నుంచి కర్డ్ అనే పదాన్ని తొలగించాలనే తమ నిర్ణయంపై చాలా మంది తమ అభిప్రాయాలు తమకు తెలిపారని ఎఫ్ఎస్ఎస్ఏఐ తాజా ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో తాము ఎఫ్‌బీవో(ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్)లకు కొత్త ఆదేశాలు ఇస్తున్నట్టు వివరించింది. ఎఫ్‌బీవోలు ఆ ప్యాకెట్లపై కర్డ్ అనే పదంతోపాటు బ్రాకెట్‌లో స్థానికంగా విస్తృతంగా వాడుకలో ఉన్న పదాన్ని గుర్తించి ప్రింట్ చేయవచ్చు అని పేర్కొంది. 

పెరుగు ప్యాకెట్లపై కర్డ్‌కు బదులు దహి అని ప్రింట్ చేయాలన్న ఆదేశాలను తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది హిందీ భాష విధింపేనని వివరించారు. తమిళ, కన్నడ భాషలను కాదని కర్డ్ ప్యాకెట్లపైనా హిందీ భాషను ప్రింట్ చేయాలని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను ఆదేశించడం కచ్చితంగా హిందీ భాష విధింపేనని పేర్కొన్నారు. తమ మాతృభాషపై ఇలాంటి దాడికి పాల్పడుతున్నవారిని దక్షిణాది నుంచి బహిష్కరించడానికి దోహదం చేస్తుందని తెలిపారు. స్థానిక భాష పదాన్నే ఉపయోగించాలని, ప్రజల సెంటిమెంట్లను గౌరవించాలని చీఫ్ మినిస్టర్ స్టాలిన్ ఎఫ్ఎస్ఎస్ఏఐని కోరారు.

Also Read: కోడి జంతువేనా?.. గుజరాత్ హైకోర్టులో ‘చిక్కు సమస్య’.. త్వరగా తేల్చాలని పౌల్ట్రీ ట్రేడర్లు విజ్ఞప్తి

నందిని బ్రాండ్ డెయిరీ ప్రాడక్టులను తయారు చేసే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్, ఆవిన్ బ్రాండ్ డెయిరీ ప్రాడక్టులను తయారుచేసే తమిళనాడు కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్‌‌లు పెరుగు ప్యాకెట్లపై కర్డ్‌కు బదులు దహి అని ప్రింట్ చేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశించినట్టు ది హిందూ బుధవారం రిపోర్టు చేసింది.

ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలను తమిళనాడు బీజేపీ కూడా వ్యతిరేకించింది. ప్రాంతీయ భాషలను ప్రమోట్ చేయాలన్న ప్రధాని మోడీ విధానానికి ఈ ఆదేశాలు విరుద్ధంగా ఉన్నాయని తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నమళై అన్నారు. పెరుగు ప్యాకెట్ పై కర్డ్ అనే పదానికి బదులు దహి అని ప్రింట్ చేయాలని ఆదేశించడాన్ని ఆయన వ్యతిరేకించారు.

Follow Us:
Download App:
  • android
  • ios