మరో తుఫాను ముంచుకొస్తుంది. లక్ష్య దీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగండం తుఫానుగా మారింది. శుక్రవారం రాత్రి 11 గంటల 30 నిమిషాలకు తుఫాను గా మారిందని హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్న తెలిపారు.

ఈ తుఫానుకి తౌక్టేగా పేరు పెట్టారని ఆమె చెప్పారు. ఈ రోజు ఉదయం 05:30 గంటలకు అమిని దీవికి ఈశాన్య దిశగా 160కీ.మీ. దూరంలో ఉన్నదన్నారు. ఇది మరింత బలపడి రాగల 12 గంటలలో తీవ్ర తుఫానుగా మారి.. తరువాత ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించనున్నట్టు తెలిపారు. తదుపరి 12 గంటలలో ఇది మరింత బలపడి అతి తీవ్రతుఫానుగా మారి గుజరాత్ తీరాన్ని పోర్బందర్ - నలియాల మధ్య 18వ తేదీ సాయంత్రం 2.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని చెబుతున్నారు.  

తౌక్టే తుఫాన్ ప్రభావం ఐదు రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చేరుకున్నాయి. మరోవైపు నావికా దళం కూడా రంగంలోకి దిగింది. 

ఇదిలా ఉండగా.. గుజ‌రాత్ ద‌గ్గ‌ర తీరాన్ని దాటే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేశారు. తుపాను కార‌ణంగా కేర‌ళ‌, గుజ‌రాత్ లో అతి భారీ వ‌ర్షాలు కురిసే ప్ర‌మాదం ఉంద‌ని తెలిపారు అధికారులు. కేర‌ళ‌, గుజ‌రాత్ తోపాటు క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, మ‌హారాష్ట్రపై కూడా ప్ర‌భావం ఉంటుంది.

తుపాను తీరం దాటే స‌మ‌యంలో 150 నుంచి 175 కిలోమీట‌ర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది వాతావ‌ర‌ణ‌శాఖ‌. దీంతో NDRF బృందాల‌ను అల‌ర్ట్ చేశారు అధికారులు. మొత్తం 53 బృందాలను సిద్ధం చేశారు. అందులో 24 బృందాలు వెంట‌నే రంగంలోకి దిగ‌గా.. మిగిలిన వాటిని తుపాను తీవ్ర‌త దృష్ట్యా ఆయా రాష్ట్రాల‌కు పంపుతారు.