ముంబై: నిసర్గ తుఫాన్ అతి తీవ్ర తుపాన్ గా మారింది. తూర్పు మద్య అరేబియా సముద్రం మీదుగా తుఫాన్ కొనసాగుతోంది. బుధవారం నాడు మధ్యాహ్ననికి ముంబైకి సమీపంలో అలీబాగ్ వద్ద ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది.

ఉత్తర మహారాష్ట్ర వైపుకు గంటకు 12 కి.మీ వేగంతో నిసర్గ తుఫాన్  ప్రయాణిస్తోంది. అలీబాగ్ కు  దక్షిణ నైరుతి దిశగా 140 కి.మీ, ముంబైకి 190 కి.మీ, సూరత్‌కు 415 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.  ఇవాళ ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ కు అనుకొని ఉన్న హరిహరేశ్వర్-దామన్ మధ్య అలీబాగ్ సమీపంలో నిసర్గ తుఫాన్ తీరం దాటనుంది.

తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 100 నుండి 120 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు ప్రకటించారు. 

రెండు వారాల్లోనే ఇండియాను తాకిన అతి పెద్ద రెండో తుఫాన్ ఇది. జూన్ మాసంలో ముంబైను తాకిన  అతి పెద్ద తుఫాన్ ఇదేనని వాతావరణ నిపుణులు  అభిప్రాయపడుతున్నారు.

తుఫాన్ కారణంగా మహారాష్ట్రలో ప్రభుత్వం పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించింది. పార్క్ లు, బీచ్ లు వంటి ప్రాంతాల్లో ప్రజలను అనుమతి ఇవ్వడం లేదు.ఈ తుఫాన్ కారణంగా గుజరాత్, మహారాష్ట్రలలో నిసర్గ తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నాయి ప్రభుత్వాలు.

గుజరాత్ లోని వల్సాద్, సూరత్, నవ్ సారీ, భరూచి జిల్లాల్లోని తీరప్రాంతాల్లో నివసించే 78,971 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నిసర్గ తుఫాన్ నేపథ్యంలో రాష్ట్రంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొన్నట్టుగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు 10ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు సిద్దం చేశారు.  మరో 6 యూనిట్లు కూడ సహాయక చర్యలను  చేపట్టేందుకు సిద్దంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.