సారాంశం

tamil nadu rains : మిచౌంగ్ తుఫాను తమిళనాడు, ఏపీపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంతా చెన్నై నగరం ఈ భారీ వానలకు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. అనేక ప్రాంతాల్లో జలమయమయ్యాయి. చల్లటి ఈదురుగాలులతో కూడా వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Chennai rains : మిచౌంగ్ తుఫాను తమిళనాడు రాష్ట్రంపై ప్రభావాన్ని చూపిస్తోంది. ఈ తుఫాను వల్ల చెన్నైలో ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈదురు గాలులతో కూడిన వర్షాల వల్ల నగరం అతలాకుతలం అయిపోతోంది. నగరంలోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ భారీ వర్షాలు అర్థరాత్రి వరకు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని తమిళనాడు వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇప్పుడు తుఫాను సముద్రంలోని పొన్నేరి-శ్రీహరికోట బెల్ట్ లో ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. సైక్లోన్‌కు దక్షిణం, పశ్చిమాన భారీ మేఘాలు వ్యాపించి ఉన్నాయని తెలిపింది. దీని వల్ల చెన్నై (కేటీసీసీ)లో అర్థరాత్రి వరకు ఇలాగే వర్షాలు కొనసాగుతాని తెలిపింది. రేపు నెల్లూరు-కావలి ప్రాంతానికి దగ్గరగా తుపాను తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. 

ఈ తమిళనాడులో కురుస్తున్న భారీ వర్షాలు వల్ల జలశయాలు నిండుకున్నాయి. రెడ్ హిల్స్ రిజార్వాయర్ లో ఉదయం 11.30 గంటలకు రెడ్ హిల్స్ మిగులు 4000 క్యూసెక్కులుగా ఉంది. ఈ ప్రాజెక్టు మొత్తం నీటిమట్టం సామర్థ్యం 21.20 అడుగులు కాగా ప్రస్తుతం 20.20 అడుగులు మేర నీరు నిలిచి ఉంది. 

ప్రస్తుతం పూండి డ్యాం మిగులు 6000 క్యూసెక్కులు, ఇన్ ఫ్లో 17000 క్యూసెక్కులుగా ఉంది. మధ్యాహ్నం 12.30 గంటలకు చెంబరంపాక్కం మిగులు 6000 క్యూసెక్కులు, ఇన్ ఫ్లో 10000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 24 అడుగులు కాగా ప్రస్తుతం 21.77 అడుగులకు చేరింది.  ఉదయం 10.30 గంటలకు చోళవరం మిగులు 3 వేల క్యూసెక్కులు, ఇన్ ఫ్లో 4 వేల క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 18.86 అడుగులకు గాను 18.01 అడుగులుగా ఉంది.

ఇదిలా ఉండగా.. మిచౌంగ్ తుఫాను వల్ల ఏపీలోని తిరుపతి, తిరుమలలో, నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కపిలతీర్థం, మాల్వానీ గుండం జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. జలపాతాలను చూసేందుకు నగర ప్రజలు కపిలతీర్థం వద్దకు తరలివచ్చారు. ఇదే స‌మ‌యంలో తిరుమ‌ల, తిరుప‌తి అనేక‌ ప్రాంతాల్లో భారీ వ‌ర్షంతో జ‌ల‌మ‌యం అయ్యాయి. దీంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా వ్య‌వ‌స్థ సైతం తీవ్రంగా ప్ర‌భావిత‌మైంది.