న్యూఢిల్లీ: ఫణి తుఫాన్ ఈ నెల 29వ తేదీ సాయంత్రం అతి తీవ్ర తుఫాన్‌గా మారిందని  భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ తుఫాన్ ఒడిశా వైపుకు పయనిస్తోందని వాతావరణ శాఖ తేల్చి చెప్పింది.

ఈ తుఫాన్ ప్రభావం ఉత్తరాంధ్రపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. చెన్నైకు  880 కి.మీ దూరంలో ఆగ్నేయంలో ఫణి తుఫాన్ కేంద్రీకృతమైంది. ఈ తుఫాన్ వాయువ్య  దిశగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

ఫణి తీవ్ర తుపాన్ మంగళవారానికి మారింది. ఇది వాయువ్య దిశగా మే 1వ తేదీ వరకు పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత తుఫాన్ ఈశాన్య దిశకు పయనించే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు ప్రకటించారు.

ఫణి తీవ్ర తుఫాన్ గా మారిన నేపథ్యంలో  కేంద్ర కేబినెట్ కార్యదర్శి  పీకే సిన్హా  కేంద్ర క్రైసిస్ మేనేజ్‌మెంట్ కమిటీ సోమవారం నాడు అత్యవసరంగా సమావేశమైంది.

ఈ తుఫాన్ ఒడిశా వైపుకు దూసుకువస్తోందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో  ఒడిశా ప్రభుత్వం కూడ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖను ఆదేశించింది.

కేరళపై కూడ ఈ తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తేల్చి చెప్పింది. అంతేకాదు సుమారు 50 కి.మీ వేగంతో పెనుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

మత్స్యకారులు ఎవరూ కూడ చేపల వేటకు సముద్రంలోకి వెళ్లకూడదని కూడ ఐఎండీ సూచించింది.ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ కోస్టల్ గార్డు సిబ్బంది ఆయా రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని కేంద్రం ఆదేశించింది.