విశాఖపట్నం: బంగాళాఖాతంలో రెండు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇది సోమవారానికి  తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఈ తుపాను ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై ఉండకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. 

ఈ నెల 30వ తేదీన తుపాను తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్  సరిహద్దులో తీరం దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఈశాన్యం వైపునకు దిశ మార్చుకునేందుకు అనువైన వాతావరణం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంటున్నారు. వాయుగుండం ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తరకోస్తాలో ఈదురుగాలులతో వర్షం పడతుందని, రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ వెల్లడించింది.
 
తెలంగాణలో మాత్రం ఎండలు మళ్లీ మంట పుట్టిస్తున్నాయి. వారం రోజులుగా వర్షాలతో కాస్త చల్లబడిన వాతావరణం శుక్రవారం ఒక్కసారిగా మారింది. ఉదయం 9 గంటల నుంచే ఎండ దంచికొట్టింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. మరో రెండు రోజుల పాటు వేడిగాలుల ఉధృతి ఉంటుందని అంటున్నారు.