భువనేశ్వర్: ఫణి తుఫాన్ శుక్రవారం నాడు ఉదయం  పదిన్నర గంటలకు పూరీ వద్ద తీరాన్ని దాటింది. తుఫాన్ వల్ల ఒడిశా రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందినట్టుగా ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది.  ఆదివారం నాడు ఫణి తుఫాన్  బంగ్లాదేశ్ సమీపంలో  తుఫాన్ బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

 

ఫణి తుఫాన్ ప్రభావం ఒడిశాపై తీవ్రంగా ఉంది. ఈ రాష్ట్రంలో తుఫాన్ కారణంగా ఒడిశా రాష్ట్రంలో  ఆరుగురు మృతి చెందినట్టుగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఒడిశాలోని ఓ ప్రభుత్వ ఇనిస్టిట్యూట్ పై కప్పు లేచిపోయింది. తుఫాన్ కారణంగా  గంటకు 175 కి.మీ వేగంతో ఉధృతంగా గాలులు వీస్తున్నాయి. తుఫాన్ కారణంగా ఆరుగురు మృతి చెందితే ఒక్కరు గాయపడినట్టుగా ఒడిశా సర్కార్ ప్రకటించింది.

గంటకు 22 కి.మీ వేగంతో ఫణి తుఫాన్ కదులుతున్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు  ప్రకటించారు. తుఫాన్ కారణంగా ఒడిశాలో పలు రైళ్లను రద్దు చేశారు. ఒడిశా-భద్రక్ సెక్షన్‌లో  శనివారం వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది.

ఈ రూట్‌లో నడిచే 140 రైళ్లను రద్దు చేసినట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది. బలమైన గాలుల కారణంగా సెల్‌టవర్లు కూడ  నేలకొరుగుతున్నాయి.తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులను కూడ మూసివేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో  సహాయక , పునరావాస చర్యల కోసం ప్రధాని మోడీ రూ.1000 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు.

ఈదురు గాలుల వల్ల రోడ్లపైనే  చెట్లు నేలకొరిగాయి. దీంతో ఒడిశాలో పలు చోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని  పునరావాస కేంద్రాల్లో ఉంటున్న ప్రజల కోసం లక్ష  ఆహార ప్యాకెట్లను హెలికాప్టర్ల ద్వారా అందించనున్నారు.