పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఫణి తుఫాన్ సూపర్‌ సైక్లోన్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఉత్తరాంధ్రపై తన ప్రతాపాన్ని చూపించిన ఫణి.. శుక్రవారం ఒడిషాపై ప్రభావాన్ని చూపించేందుకు సిద్ధమైంది.

కాగా ఏపీ కంటే ఒడిషాకే తుఫాను వల్ల అధిక నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా తుఫానుతో పాటు ఉప్పెన ముప్పు కూడా పొంచి వుందని గోపాల్‌పూర్ డాప్లర్ రాడార్ కేంద్రం అధికారులు చెప్పడంతో అక్కడి ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు.

ఫణి తీరాన్ని దాటే సమయంలో సముద్రంలో సుమారు 1.5 నుంచి 2 మీటర్ల ఎత్తు వరకు రాకాసి అలలు ఎగిసిపడే అవకాశముందని వారు చెబుతున్నారు. తుఫాను తీరాన్ని దాటుతుందని చెబుతున్న పూరీ జిల్లా బ్రహ్మగిరి సమితి బలుకుండో ప్రాంతం చాలా సమతలంగా ఉంటుంది.

సాధారణంగా సమతల ప్రాంతంలో అధికా తీవ్రత గల తుఫాన్లు సంభవిస్తే ఉప్పెన ప్రమాదం పొంచి ఉంటుంది. అలల తీవ్రతకు సముద్ర జలాలు పొంగిపొర్లుతాయి దీనినే ఉప్పెన అంటారు. ఇలాంటి ప్రాంతంలోనే బలుకుండో ఉందని అధికారులు చెబుతున్నారు.

పూరీ నుంచి జగత్‌సింగ్‌పూర్ వరకు 175 కిలోమీటర్ల పరిధిలో సముద్ర తీరం మొత్తం సమతల భూభాగమే ఉంది. దీంతో బ్రహ్మగిరి, కృష్ణప్రసాద్, యరసమ, మహాకాలపడ, పారాదీప్ ప్రాంతాలకు ముప్పు పొంచి ఉండటంతో తుఫాను కారణంగా ఆస్తి, ప్రాణ నష్టాలు అధికంగా ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది.

మరోవైపు భారీ వర్షాల కారణంగా ఒడిషాలోని మహానది, వైతరణి, రుషికుయ్య, సురవర్ణరేఖ, దేవీ నదులతో పాటు వాటి ఉపనదులకు కూడా వరద ప్రమాదం పొంచి ఉన్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.