ఆసని తుఫాన్ వేగంగా కదులుతోంది. ఇది ఈ నెల 21వ తేదీన అండమాన్, నికోబార్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ తుఫానుకు శ్రీలంక ‘అసని’ అని పేరు పెట్టింది. ఈ తుఫాను ప్రభావం వల్ల మార్చి 20, 21వ తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ ఏడాది తొలి తుఫాను (Cyclone) మార్చి 21 నాటికి బంగాళాఖాతంలో ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. అదేరోజు అండమాన్, నికోబార్ ను తాకే అవకాశం ఉంది. అండమాన్‌ను తాకిన తర్వాత బంగ్లాదేశ్, మయన్మార్ వైపు కదులుతుంది.
ఈ తుఫానుకు శ్రీలంక దేశం ‘అసని’ (Asani) అని నామకరణం చేసింది. దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై ఏర్పడిన అల్పపీడనం తూర్పు-ఈశాన్య దిశగా కదిలి, మార్చి 17 గురువారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంపై కేంద్రీకృతమై ఉంది. ఇది తూర్పు-ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా మార్చి 19 శనివారం ఉదయం వరకు ఉంటుంది.
ఆ తర్వాత ఇది అండమాన్, నికోబార్ దీవుల వెంట దాదాపు ఉత్తరం వైపుగా కదులుతూ మార్చి 20 ఉదయం నాటికి అల్పపీడనంగా మారి మార్చి 21న తుఫానుగా పరిణామం చెందుతుంది. ఆ తర్వాత, ఇది దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి మార్చి 22 ఉదయం బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అయితే నేటి నుంచి ఇది తీవ్రంగా మారే అవకాశం ఉంది. ‘‘ ఈ అల్పపీడనం మరింత తూర్పు-ఈశాన్య ప్రాంతాలను కదిలిస్తుంది. శనివారం ఉదయం నాటికి అండమాన్ సముద్రాన్ని ఆనుకొని బాగా గుర్తించబడిన అల్పపీడన వ్యవస్థగా మారుతుంది. మార్చి 20, 21 తేదీల్లో అండమాన్, నికోబార్ దీవుల వెంబడి అల్పపీడన కదలిక మరింత తీవ్రమవుతుంది ” అని వాతావరణ శాఖ ఒక స్పెషల్ బులిటెన్ లో పేర్కొంది.
తుఫాన్ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ వైపు వెళ్లే అవకాశం ఉన్నందున, దీని ప్రభావం ప్రధాన భూభాగంపై చూపదని వాతవారణ శాఖ తెలిపింది. ఈ తుఫాను ప్రభావం వల్ల మార్చి 20, 21 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అయితే అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు మార్చి 17 నుంచి 22 మధ్య అండమాన్ సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.
