ఆంఫన్ తుఫాన్ బెంగాల్ లో బీభత్సం సృష్టించింది. ఈ తుఫాన్ కారణంగా అక్కడ 78మంది ప్రాణాలు కోల్పోయారు. గత వందేళ్లలో ఆ రాష్ట్రాన్ని తాకిన అత్యంత తీవ్రమైన తుఫాన్‌ ఇదే కావడం గమనార్హం. తుఫాను సృష్టించిన విలయానికి జనం వణికిపోయారు. భారీవర్షాలు, పెనుగాలులకు వేలాదిగా ఇళ్లు నేల మట్టమయ్యాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగి పడటంతో అరడజను జిల్లాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఒక్క కోల్‌కతాలోనే 14లక్షల మందికి పైగా అంధకారంలో మగ్గిపోతున్నారు.

1,500కు పైగా సెల్‌ టవర్లు ధ్వంసం కావడంతో మొబైల్‌, ఇంటర్నెట్‌ సేవలకు ఆటంకం ఏర్పడింది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దాదాపు 5లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక కోల్‌కతా అంతర్జాతీయ విమానాశ్రయం నీట మునగడంతో కార్గో విమానాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. 

గురువారం నుంచి సర్వీసులను పునరుద్ధరించారు. కాగా, ఆంఫన్‌ తుఫాన్‌ నేపథ్యంలో భారత్‌, బంగ్లాదేశ్‌లోని 1.9 కోట్ల మంది చిన్నారులు అంటువ్యాధులకు త్వరగా గుర య్యే ముప్పుందని యునిసెఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది. 

కాగా... ఈ తుఫాను బీభత్సం పై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. తుఫాన్‌ తీవ్రత కరోనా మహమ్మారి కంటే దారుణంగా ఉందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నష్టం ఎంత వాటిల్లిందో ఇప్పుడే చెప్పలేమన్నారు. తుఫాన్‌ మృతుల కుటుంబాలకు రూ.2- 2.5 లక్షల పరిహారాన్ని ఆమె ప్రకటించారు. మోదీ స్వయంగా వచ్చి ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని, రాష్ట్రానికి ఇతోధిక సాయం అందించాలని కోరారు. 

‘‘తుఫాన్‌ వల్ల సంభవించిన వినాశనాన్ని చూస్తున్నాం. ఈ కష్టకాలంలో దేశమంతా మీకు అండగా ఉంటుంది’’ అని మోదీ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాలను ఆయన శుక్రవారం ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలిస్తారని ఉన్నతాధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. ఆంఫన్‌ ప్రభావం బంగ్లాదేశ్‌పైనా తీవ్రంగానే పడింది. పదిమంది వరకూ మృత్యువాత పడ్డారు. 20లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.