దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు
టెక్నాలజీలో వస్తున్న మార్పులు ప్రజల అవసరాలను మరింత సౌకర్యవంతంగా మారుస్తున్నాయి. అయితే, కొందరు సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ తరహాలోనే చోటుచేసుకున్న దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసాన్ని సైబరాబాద్ పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు.
కాలం మారుతున్న కొద్ది టెక్నాలజీ లోనూ విప్లవాత్మక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజల జీవితాలను మరింత సుఖమయంగా మార్చుతున్న ఈ టెక్నాలజీ ప్రస్తుతం దుర్వినియోగం (fraud)అధికంగా అవుతోంది. మరీ ముఖ్యంగా సాంప్రదాయ నేరాలతో పోల్చితే.. సైబర్ నేరాలు (cyber crime) రికార్డు స్థయిలో పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక సైబర్ నేరాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే తరహాలో దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసాన్ని పోలీసులు వెలుగులోకి తీసుకువచ్చారు. నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తూ.. వందల కోట్ల రూపాయల మోసానికి పాల్పడుతున్నారు. ఏకంగా దేశరాజధానిలోనే ఈ వ్యవహారాన్ని నడుపుతుండటం గమనార్హం. రంగంలోకి దిగిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
దేశరాజధాని ఢిల్లీ కేంద్రంగా సైబర్ మోసాలకు (cyber fraud) పాల్పడుతున్న ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర మీడియాకు వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. దేశంలో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఢిల్లీలోని ఉత్తమ్ నగర్‌లో ఎస్‌బీఐ (SBI Call centre) పేరుతో నకిలీ కాల్ సెంటర్ ను ఓ ముఠా నిర్వహిస్తున్నది. సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠా భారతీయ స్టేట్ బ్యాంకు ఏజెంట్ల నుంచి వినియోగదారుల బ్యాంకు ఖాత వివరాలను సేకరిస్తున్నారు. వీటి ఆధారంగా వినియోగదారులకు కాల్ చేస్తూ.. గోప్యమైన వివరాలను సేకరించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా వేలాది మందిని మోసం చేశారు. వందల కోట్ల రూపాయలను ఈ సైబర్ దొంగల ముఠా కొల్లగొట్టింది. ఇది దేశంలోనే అతిపెద్ద సైబర్ మోసం అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర (Stephen Raveendra) అన్నారు.
ఢిల్లీలోని ఉత్తమ్‌నగర్‌లో ఎస్‌బీఐ (State Bank of India) పేరుతో నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచే 1860 180 1290 అనే నంబర్ నుంచి ఫోన్ చేస్తారు. అనంతరం కార్డుల వివరాలు, ఖాతాల వివరాఉ సేకరించి డబ్బు కాజేస్తున్నారు. దీంతో పాటు స్పూఫింగ్ అప్లికేషన్ల ద్వారా ఖాతాదారుల నగదు లూటీ చేస్తూ సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా ఒక్క ఏడాదిలోనే దేశ వ్యాప్తంగా 33 వేలకు పైగా ఫోన్లు (Fake Call Frauds) చేసిందన్నారు. వందల కోట్ల రూపాయాలు మోసం చేశారని వెల్లడించారు. దేశవ్యాప్తంగా వీరి బాధితులు ఉన్నారని తెలిపారు. ఈ ముఠా చేసిన సైబర్ మోసాలు సంబంధించి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 209 కేసులు నమోదు అయినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు లోతైన దర్యాప్తుతో ఈ సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 14 మందిని అరెస్టు చేశామని సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. అలాగే, ముఠా సభ్యుల నుంచి 30 సెల్‌ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, కారు, బైక్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కాల్ సెంటర్ కేసులో ఫర్మాన్ హుస్సేన్ ప్రధాన నిందితుడిగా గుర్తించామని తెలిపారు.