28 సార్లు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన మహిళ : బ్యాంకు ఖాతా నుండి 7 లక్షలు మాయం

cyber criminals cheated mumbai woman
Highlights

ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు 

ఇటీవల ఆన్ లైన్ మోసాలపై పోలీసులు ప్రజల్ని ఎంత అప్రమత్తం చేస్తున్నప్పటికి మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజల అమాయకత్వం, ఆన్ లైన్ వ్యవహారాలపై వారికి అవగాహన లేకపోవడమే సైబర్ నేరగాళ్ళకు పెట్టుబడిగా మారింది. ఇలా ఓ అమాయక మహిళను బ్యాంక్ నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి ఏకంగా ఆమె బ్యాంక్ ఖాతా నుండి దాదాపు 7 లక్షలు మాయం చేశారు. 

ఈ ఘటనకు  సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ముంబయిలోని ధారావి ప్రాంతానికి చెందిన ఓ గృహిణి(40) కి ఇంటర్నెట్ అంటే ఏంటో కూడా తెలీదు. ఈమె భర్త కువైట్ లో ఉండగా కొడుకుతో కలిసి ముంబై లో ఉంటోంది. అయితే ఇటీవల ఈమె ఇంటర్ చదువుతున్న కొడుకు చదువు కోసం 10 లక్షలు విద్యారుణం తీసుకుంది. ఆ డబ్బులను తన బ్యాంకు ఖాతాలోనే ఉంచుకుంది.

అయితే ఆమెకు మే 17 వ తేదీన ఓ సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. తనను తాను బ్యాంకు మేనేజర్ గా పరిచయం చేసుకుని మీ ఏటీఎం కార్డు పనిచేయడం లేదని, ఏటీయం కార్డు వివరాలతో పాటు మీకొచ్చే ఓటీపి వివరాలు చెప్పాలని కోరాడు. ఆన్ లైన్ మోసాలపై అవగాహన లేని ఆమె అతడు అడిగిన వివరాలను చెప్పింది. ఇలా  ప్రతిసారి అతడు ఫోన్ చేసి ఓటిపి వివరాలు అడగ్గా ఆమె చెబుతూ పోయింది. సదరు మహిళ నిరక్ష్యరాసురాలు కావడంతో ఫోన్ కు వచ్చే మెసేజ్ ల ద్వారా జరుగుతున్న మోసాన్ని కనిపెట్టలేకపోయింది. ఇలా అతడు ఏకంగా 28 సార్లు ఆమెకు ఫోన్ చేసి ఓటిపి వివరాలను తీసుకున్నాడు. మొత్తంగా సదరు మహిళ ఖాతా నుండి 7 లక్షల వరకు తస్కరించాడు.

అయితే ఆమెకు డబ్బుల అవసరం కావడంతో బ్యాంకు కు వెళ్లగా అకౌంట్ లో ఉన్న డబ్బుల చూసి ఆశ్చర్యపోయింది.  దీంతో మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మొదటిసారి  మే 17న అత్యల్పంగా రూ.4 వేలు ‘ఆక్సిజెన్‌’ వ్యాలెట్‌కు పంపిన సైబర్ మోసగాడు.. అత్యధికంగా ముంబయిలోని ‘ఫోన్‌పే’ వ్యాలెట్‌కు రూ.49,999 పంపినట్లు పోలీసులు గుర్తించారు.

loader