ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ. 4 కోట్ల విలువైన అమెరికన్ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశారు.
విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న బంగారం, డబ్బు, డ్రగ్స్ ను అడ్డుకోవడానికి కస్టమ్స్ అధికారులు ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నా..స్మగ్లర్లు ఏ మాత్రం తగ్గడం లేదు. కొత్త కొత్త మార్గాల్లో అన్వేషిస్తూ.. బంగారం, డబ్బు, డ్రగ్స్ ను మన దేశంలోకి అక్రమంగా తరలిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో అడ్డంగా బుక్కవుతున్నారు.
తాజాగా దేశ ఆర్థిక రాజధానిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ మొత్తంలో అమెరికా డాలర్లను స్వాధీనం చేసుకుంటున్నారు ముంబై కస్టమ్స్ అధికారాలు. ముంబై లోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు రూ.4.1 కోట్ల విలువైన 4,97,000 డాలర్లను స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారం అందుకున్న ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ బుధవారం ఉదయం దుబాయ్‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులను అడ్డుకున్నారు. వారి బ్యాగేజీని పరిశీలించగా, చీరలు, పాదరక్షలు, బ్యాగ్‌లో దాచిన 4,97,000 డాలర్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురిని అరెస్టు చేసి స్థానిక కోర్టు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు. పట్టుబడిన కరెన్సీ విలువ మన దేశంలో (భారతీయ కరెన్సీలో) దాదాపు 4.1 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.
గతంలోనూ ఇలాంటి కేసులు..
ఇలాంటి కేసులు నమోదు కావడం కొత్తేమే కాదు. గత నెల ప్రారంభంలో.. ముంబై విమానాశ్రయానికి చెందిన కస్టమ్స్ అధికారులు అక్టోబర్ 11, 12 తేదీల్లో 15 కిలోల బంగారం, రూ. 7.87 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని, రూ. 22 లక్షల విలువైన డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో నాలుగు కేసుల్లో ఏడుగురిని అరెస్టు చేశారు.
ఈ ఘటనపై కస్టమ్స్ అధికారులు మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (సీఎస్‌ఎంఐఏ) అధికారులు ఇంటెలిజెన్స్ ఇన్‌పుట్‌ల మేరకు దుబాయ్ నుంచి వచ్చిన ఓ భారతీయుడికి రూ.5.20 కోట్ల విలువైన 9.895 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ బంగారాన్ని పేస్టు రూపంలో మర్చి.. ప్రత్యేకంగా రూపొందించిన చెస్ట్ బెల్టులో తొమ్మిది పాకెట్లలో ఉంచారు. దుబాయ్‌లో ఇద్దరు సూడాన్ ప్రయాణికులు తనకు బంగారం అందజేసినట్లు భారతీయుడు వెల్లడించాడు.
