సెకండ్ వేవ్‌లో కరోనా వైరస్ తీవ్రమవుతోన్న వేళ వైద్య రంగం, మందులు ఇతర సామాగ్రికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యపరంగా ప్రజలపై పడుతోన్న భారాన్ని తగ్గించాలని నిర్ణయించింది.

ఆక్సిజన్, కొవిడ్ టీకాల దిగుమతిపై కస్టమ్స్ డ్యూటీ, ఆరోగ్య సెస్‌ను తక్షణమే మాఫీ చేస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వచ్చే మూడు నెలల కాలానికి ఇది అమల్లో ఉండనున్నట్లు తెలిపింది. దేశంలో నెలకొన్న కొవిడ్ పరిస్థితులపై శనివారం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అనంతరం ఈ ప్రకటన వెలువడింది.   

తాజా నిర్ణయం వస్తువుల లభ్యతను పెంచడమే కాక చౌకగా లభించేలా చేస్తుందని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. అలాగే వాటికి త్వరగా కస్టమ్స్ అనుమతులు వచ్చేలా చూడాలని ప్రధాని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.

దేశవ్యాప్తంగా కరోనా రెండో దశలో ఏర్పడుతోన్న ఆక్సిజన్ కొరతను దృష్టిలో ఉంచుకొని కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింగపూర్ నుంచి యుద్ధవిమానాల్లో ఆక్సిజన్ భారత్‌కు వచ్చేలా ఏర్పాట్లు చేసింది. 

Also Read:గ్రామాల్లోకి కరోనా.. గతేడాది అడ్డుకోగలిగాం, ఈసారి సవాలే: ప్రధాని మోడీ

కాగా, ప్రభుత్వం దిగుమతి సుంకం ఎత్తివేసిన వస్తువుల జాబితాలో ఆక్సిజన్, ఆక్సిజన్ క్యానిస్టర్, ఫిల్లింగ్ సిస్టమ్స్, కంటైనర్లు, ట్రాన్స్‌పోర్ట్ ట్యాంకులు, ఆక్సిజన్ జనరేటర్లు, వెంటిలేటర్లు (వెంటిలేటర్స్ విత్ నాజల్ క్యాన్యులా) ఉన్నాయి. వాటితో పాటు కరోనా టీకాల దిగుమతిపై కూడా కస్టమ్ డ్యూటీని మూడు నెలల కాలానికి మాఫీ చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. 

అంతకుముందు శుక్రవారం ప్రధాని నరేంద్రమోడీ ఆక్సిజన్ ఉత్పత్తిదారులతో సమావేశమయ్యారు. ఆక్సిజన్ ఉత్పత్తితో పాటు రవానా గురించి ఆయన చర్చించారు. అయితే గత నెలలో కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరగడంతో దేశంలో ఆక్సిజన్ సంక్షోభం సంభవించిందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే ఢిల్లీలోని జైపూర్ గోల్డెన్ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత వల్ల రాత్రి 25 మంది మరణించారు.