మధ్యప్రదేశ్ లో శ్రీరామనవమి వేడుకల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రాముడి ఉరేగింపు సందర్బంగా హింస చెలరేగింది. దీంతో పలువురు గాయపడ్డారు. కొన్ని ఇళ్లకు, వాహనాలకు నిప్పటించారు. దీంతో పలు చోట్ల కర్ఫ్యూ విధించారు. 

భోపాల్ : భోపాల్ నగరంలో Ram Navami procession సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పలు చోట్ల వాహనాలు, ఇల్లు దగ్థమయ్యాయి. దీంతో madhyapradeshలోని ఖర్గోన్‌లోని కొన్ని ప్రాంతాల్లో Curfew విధించినట్టు సీనియర్ అధికారి ఆదివారం తెలిపారు. నగరంలో ఎక్కువ మంది గుమిగూడే సమావేశాలు, సభలను నిషేధించారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు.

రామ జన్మదినం, కల్యాణం జరుపుకునే పండుగరోజైన రామ నవమిని పురస్కరించుకుని ఊరేగింపు చేస్తున్న క్రమంలో ఘర్షణలు చెలరేగాయి. "రామ నవమి ఊరేగింపు తలాబ్ చౌక్ ప్రాంతం నుండి ప్రారంభమైనప్పుడు, ర్యాలీపై రాళ్లు రువ్వినట్లు ఆరోపణలు వచ్చాయి. పరిస్థితిని నియంత్రించడానికి పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. ఖర్గోన్ నగరంలో మొత్తం ఊరేగింపు జరగాల్సి ఉండగా.. హింస కారణంగా ఉరేగింపు మధ్యలోనే ఆగిపోయింది’ అని అదనపు కలెక్టర్‌ ఎస్‌ఎస్‌ ముజల్దే అన్నారు.

ఊరేగింపులో లౌడ్ స్పీకర్ల పెట్టి పాటలు పెట్టడంతో.. స్థానిక నివాసితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా వినకపోవడంతో.. రాళ్లు విసిరారని ఆరోపణలు వచ్చాయి. ఊరేగింపు ముస్లింలు నివసించే ప్రాంతం మీదుగా వెడుతున్నప్పుడు ఈ దాడి జరిగిందని ప్రాథమిక సమాచారం. గొడవకు సంబంధించిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.

గొడవ క్రమంలో యువకులు వాహనాలకు నిప్పు పెట్టడం, కొందరు యువకులు రాళ్లు రువ్వడం, పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్‌ ప్రయోగించడం వంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ దాడిలో పోలీసు సూపరింటెండెంట్ సిద్ధార్థ్ చౌదరి సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. చౌదరి కాళ్లపై రాయితో కొట్టడంతో.. కాలుకి తీవ్ర రక్తస్రావమై స్ట్రెచర్‌లో ఆసుపత్రికి తీసుకెళ్లడం కూడా కనిపించింది.

దీంతో ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, ఎవ్వరూ బైటికి రావద్దని పోలీసులు ప్రకటనలు చేస్తున్నారు. ముష్కర మూకలు నాలుగు ఇళ్లకు నిప్పంటించారని, ఒక ఆలయాన్ని ధ్వంసం చేశారని సమాచారం. ఇప్పటికీ గొడవ సద్దుమణగలేదు. నగరంలో పలు చోట్ల రాళ్లు రువ్వుతున్నట్లు సమాచారం అందడంతో పొరుగు జిల్లాల నుంచి అదనపు పోలీసు సిబ్బందిని రప్పించారు.