ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ ఇంటి వద్ద విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆయన నివాసం వద్ద విధులు నిర్వహిస్తున్న 31 ఏళ్ల సిఆర్పీఎఫ్ జవాను ప్రమాదవశాత్తు తనను తాను షూట్ చేసుకుని మరణించాడు. పోలీసులు గురువారంనాడు ఆ విషయం చెప్పారు. 

ఆ సిఆర్పీఎఫ్ జవానును గుజరాత్ లోని జునాగఢ్ కు చెందిన దేవదన్ బకోత్రాగా గుర్తించారు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగింది. ముకేష్ అంబానీకి చెందిన 27 అంతస్తుల భవనం వద్ద కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన సెక్యూరిటీ ఫోర్స్ లో ఆ ఘటన చోటు చేసుకుంది. 

దేవదన్ బకోత్రా తడబాటుకు గురై కింద పడిపోయాడని, దాంతో అతని ఆటోమేటిక్ రైఫిల్ నుంచి బుల్లెట్ దూసుకెళ్లిందని, అతని ఛాతీపై బుల్లెట్ తగిలిందని సీఆర్పీఎఫ్ అధికారులు చెప్పారు. 

వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించినట్లు, అయితే, గురువారం రాత్రి అతను చికిత్స పొందుతూ మరణించాడని వారు తెలిపారు. పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత అతని మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.. 

ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అది ప్రమాదవశాత్తు జరిగిన ఫైరింగ్ అని, అది ఆత్మహత్య కాదని డిప్యూటీ పోలీసు కమిషనర్ రాజీవ్ జైన్ చెప్పారు.