ఇటీవల పుల్వామా ఉగ్రదాడిలో 43మంది భారత జవానులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను దేశప్రజలు మరవకముందే.. మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఓ అమరజవాను భార్యపై ఓ దుర్మార్గుడు కన్నువేశాడు.  ప్రభుత్వం ఆమెకు ఇచ్చిన సొమ్ముని అత్యంత చాకచక్యంగా కాజేశాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని సెహోర్ గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..  2013 శ్రీనగర్ లో ఉగ్రదాడిలో మధ్యప్రదేశ్ కి చెందిన జవాను ఓం ప్రకాశ్ మారదానియా ప్రాణాలు కోల్పోయారు. కాగా.. ఆయన భార్య కమల్ బాయికి ప్రభుత్వం రూ8లక్షల ఆర్థిక సహాయం చేసింది. ఈ విషయాన్ని గమనించిన మిశ్రీలాల్ అనే వ్యక్తి.. ఆ సొమ్ముపై కన్నేశాడు.ఈ నెల 11వ తేదీన తాను సీఆర్పీఎఫ్ కి చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు.

ఆమెకు మాయమాటలు చెప్పి.. బ్యాంక్ నుంచి రూ.8లక్షలు డ్రా చేసేలా చేశాడు. అనంతరం ఆ డబ్బుతో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు వారు చెప్పారు.