జమ్మూ: జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి నుండి ఓ జవాన్ చివరి నిమిషంలో తప్పించుకొన్నారు. ప్రాణాలు కోల్పోయిన జవాన్లతో పాటు బేల్కర్ అనే జవాన్ కూడ వెళ్లాల్సి ఉంది. అయితే ఆయనకు చివరి నిమిషంలో ఉన్నతాధికారులు సెలవును మంజూరు చేశారు. దీంతో ఆయన ప్రాణాపాయం నుండి తప్పించుకొన్నారు.

ఈ నెల 14వ తేదీన పూల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 42 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. బేల్కర్ కూడ చనిపోయిన జవాన్లతో అదే వాహనంలో వెళ్లాల్సి ఉంది. కానీ, ఆయన ఎప్పటి నుండో సెలవు అడుగుతున్నారని ఆయనకు సెలవు ఇచ్చారు.

ఈ నెల 24వ తేదీన బేల్కర్ వివాహం జరగనుంది. దీంతో ఆయనకు ఉన్నతాధికారులు సెలవులు ఇచ్చారు. సెలవులు దొరకడంతో బేల్కర్ సంతోషంతో ఇంటికి వెళ్లారు. అయితే ఉగ్రవాదుల దాడిలో తన సహచరులు మృత్యువాత పడిన విషయం తెలుసుకొన్న బేల్కర్ విషాదంలో మునిగిపోయాడు. 

మృతి చెందిన జవాన్లతో పాటు బేల్కర్ వారితో కలిసి వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. కానీ, పెళ్లి కారణంగా ఆయనకు సెలవు మంజూరు చేయడంతో ఈ ప్రమాదం నుండి ఆయన తప్పించుకొన్నారు.

నాలుగేళ్ల క్రితమే బేల్కర్ సీఆర్‌పీఎఫ్ లో చేరారు. ఎనిమిది మాసాల క్రితం ఆయన పెళ్లి కుదిరింది. కానీ, పెళ్లి జరుగుతోందనే ఆనందం కూడ ఆయనలో ఏ మాత్రం లేకుండా పోయిందని బేల్కర్ కుటుంబసభ్యులు చెబుతున్నారు.