రాజ్యసభ ఎన్నికలు ఉత్కంఠగా జరుగుతున్నాయి. పార్టీలు తమ ఎమ్మెల్యేలను తమ అదుపాజ్ఞల్లో పెట్టుకుని తమ రాజ్యసభ అభ్యర్థిని గెలిపించుకునే పనుల్లో ఉన్నాయి. కాగా, కర్ణాటకలో ఓ జేడీఎస్ ఎమ్మెల్యే క్రాస్ వోటింగ్ చేసినట్టు స్వయంగా వెల్లడించారు. తాను కాంగ్రెస్ పార్టీకి ఓటేశానని తెలుపడంతో కలకలం రేగింది.
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారి పోకుండా పార్టీలు జాగ్రత్తపడుతుంటే.. మరికొన్ని పార్టీలు ఇతర పార్టీల మద్దతు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలోనే కర్ణాటక కీలక పరిణామం ఎదురైంది. జేడీఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఆయనే స్వయంగా మీడియాకు వెల్లడించారు. తనకు కాంగ్రెస్ అంటే ప్రేమ అని, అందుకే ఆ పార్టీకే ఓటేశానని వెల్లడించడంతో రాజకీయ చర్చకు తెరలేసింది.
కర్ణాటక కోలార్ నియోజకవర్గానికి చెందిన జేడీఎస్ ఎమ్మెల్యే కే శ్రీనివాస గౌడ శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. రాజ్యసభ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు తెలిపారు. ఎందుకు అని ప్రశ్నించగా ఐ లవ్ కాంగ్రెస్ అంటూ వెళ్లిపోయారు. రాజ్యసభ ఎన్నికల్లో జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి కాకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా వేయాలని కాంగ్రెస్ లీడర్ సిద్ద రామయ్య ఆకర్షించే ప్రయత్నం చేశారని జేడీఎస్ పార్టీ చీఫ్ హెచ్‌డీ కుమారస్వామి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే కే శ్రీనివాస గౌడ ఈ విషయాన్ని వెల్లడించడం గమనార్హం.
కర్ణాటక అసెంబ్లీలో మొత్తం 224 సీట్లు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ బలం 70 ఎమ్మెల్యేలు, కాగా, బీజేపీకి 121 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. కాగా, జేడీఎస్ ఎమ్మెల్యేలు 32 మంది ఉన్నారు. తాజాగా జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి నాలుగు స్థానాలకు పోలింగ్ జరుగుతున్నది. ఇందులో రెండు సీట్లను బీజేపీ అలవోకగా గెలుచుకునే బలాన్ని కలిగి ఉన్నది. కాగా, కాంగ్రెస్ పార్టీ ఒక సీటును కైవసం చేసుకోనుంది. అయితే, ఇప్పుడు అసలైన పోటీ ఆ మిగిలిన సీటు కేంద్రంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్‌ల మధ్య జరుగుతున్నది.
కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాల కోసం జైరాం రమేశ్, మన్సూర్ అలీ ఖాన్, బీజేపీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, యాక్టర్ జగ్గేశ్, కర్ణాటక ఎమ్మెల్సీ లహర్ సింగ్ సిరోయలను బరిలోకి దించింది. కాగా, జేడీఎస్ తరఫున రియల్ ఎస్టేట్ దిగ్గజం డీ కుపేంద్ర రెడ్డి బరిలో నిలుచున్నారు.
ఆ నాలుగో స్థానంలో బీజేపీని ఓడించడానికి జేడీఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు ఓటేయాలని కాంగ్రెస్ సీనియర్ లీడర్ సిద్ద రామయ్య పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ లేఖను గురువారం పోస్టు చేశారు.
దీంతో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి ఫైర్ అయ్యారు. సిద్ద రామయ్య తమ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు.
