ఢిల్లీలోని ముంద్కా మెట్రో స్టేషన్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 27 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. ఫైరింజన్లు రావడం ఆలస్యం కావడం వల్లే ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఓ క్రేన్ డ్రైవర్ అధికారుల కంటే ముందే ఓ 50 మందిని కాపాడాడు.
దేశ రాజధాని ఢిల్లీలో (delhi) ఇటీవల చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో (fire accident) 27 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. అయితే అగ్నిప్రమాదాన్ని చూసిన కొందరు స్థానికులు ఫైరింజన్లు రావడానికి ముందే సహాయక చర్యలు చేపట్టి పలువురి ప్రాణాలు కాపాడారు. అలాంటి వారిలో ఒకరే ఈ క్రేన్ డ్రైవర్. భవనం మొత్తం మంటలు వ్యాపించడానికి ముందే అతను 50 నుంచి 55 మందిని రక్షించారు.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలోని ముంద్కా మెట్రోస్టేషన్ (mundka metro station) సమీపంలోని ఓ మూడంతస్తుల భవనంలో శుక్రవారం సాయంత్రం జరిగిన భారీ అగ్నిప్రమాదం దేశాన్ని షాక్‌కు గురిచేసింది. సరిగ్గా ఇదే సమయంలో ముంద్కా ఉద్యోగ్ నగర్ నుంచి దయానంద్ తివారీ అనే క్రేన్ డైరెక్టర్ అటుగా వెళ్తున్నాడు. ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే క్రేన్ యజమాని, ఓ అసిస్టెంట్‌తో సహా వెంటనే అగ్నిప్రమాదం జరిగిన భవనం దగ్గరకు చేరుకుని వారిని రక్షించే కార్యక్రమం మొదలుపెట్టారు.
ఫైరింజిన్లు వచ్చే లోగా దాదాపు 50 మందిని వీరు కాపాడారు. మరింత మందిని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ మంటలు బిల్డింగ్ మొత్తం అంటుకోవడంతో వీరి వల్ల కాలేదు. అగ్నిమాపక యంత్రాలు ప్రమాదం జరిగిన గంటన్నర తర్వాత ఆలస్యంగా చేరుకున్నాయని.. లేదంటే అంత విషాదం జరిగేది కాదని దయానంద్ తివారీ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇతని సాహసం, మానవత్వంపై సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మరోవైపు ఈ ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేసిన ఢిల్లీ పోలీసులు.. మృతదేహాల గుర్తింపు కోసం డీఎన్ఏ టెస్టులు చేస్తున్నారు. అటు ఈ ఘోర విషాదానికి కారణమైన భవన యజమానిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు రోజులుగా పరారీలో వున్న మనీశ్ లక్రాను పట్టుకున్నట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.
