కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలించింది. స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ సీ రాజగ్‌పాలాచారి మునిమనవడు సీఆర్ కేశవన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 

కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలించింది. స్వతంత్ర భారత తొలి గవర్నర్ జనరల్ సీ రాజగ్‌పాలాచారి మునిమనవడు సీఆర్ కేశవన్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ “ప్రస్తుత” మార్గంలో విభేదాలను పేర్కొంటూ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. రెండు దశాబ్దాలకు పైగా కాంగ్రెస్‌లో కొనసాగిన కేశవన్.. పార్టీని వీడుతున్నట్టుగా ట్విట్టర్‌ వేదికగా ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఛారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన రాజీనామా లేఖను కూడా పోస్టు చేశారు. అందులో కేశవన్ పలు అంశాలను ప్రస్తావించారు.

తాను 2001లో కాంగ్రెస్ పార్టలో చేరిన సమయాన్ని గుర్తుచేసిన కేశవన్.. దేశానికి సేవ చేయడానికే విదేశాల నుంచి భారత్‌కు వచ్చి కాంగ్రెస్‌లో చేరానని.. కానీ ఇప్పుడు ఆ అవకాశం పార్టీలో ఇవ్వడం లేదని కేశవన్ అన్నారు. ‘‘అందరినీ కలుపుకొని,పెరుగుతున్న జాతీయ పరివర్తన లక్ష్యానికి కట్టుబడి ఉన్న’’ భావజాలంతో నడిచే దేశానికి సేవ చేయడానికి భారతదేశానికి తిరిగి వచ్చానని చెప్పారు

కాంగ్రెస్‌లో తన ప్రయాణాన్ని వివరించిన కేశవన్.. సవాలుగా, ఆకర్షణీయంగా ఉందని అన్నారు. శ్రీపెరంబుదూర్‌లోని రాజీవ్ గాంధీ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ డెవలప్‌మెంట్‌కు వైస్ ప్రెసిడెంట్‌గా, ప్రసార భారతి బోర్డు సభ్యుడిగా సేవలందించే అవకాశం లభించిందని చెప్పారు. ఈ అవకాశాలు కల్పించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. తాను వేరే పార్టీలో చేరే అవకాశం ఉందన్న ఊహాగానాలను సీఆర్ కేశవన్ తోసిపుచ్చారు. ఏదో ఒక ఆఫర్ తన రాజీనామాకు కారణమై ఉండవచ్చనే వార్తల్లో నిజం లేదన్నారు. తదుపరి ఏమి జరుగుతుందో తనకు తెలియదని చెప్పారు. 

దాదాపు రెండు ద‌శాబ్ధాలుగా పార్టీ కోసం నిస్వార్ధంగా ప‌నిచేశాన‌ని, కానీ పార్టీలో ప్ర‌స్తుతం విలువ‌లు లేవ‌ని ఆరోపించారు. అందుకే తాను ఇటీవ‌ల జ‌రిగిన రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన‌లేద‌న్నారు. ‘‘నేను కొత్త మార్గాన్ని రూపొందించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందువల్ల నేను కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేస్తున్నాను. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఛారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీగా నా రాజీనామాను కూడా తగిన అధికార యంత్రాంగానికి సమర్పించాను’’ సీఆర్ కేశవన్ పేర్కొన్నారు. ఇక, ఇటీవల కేంద్ర మాజీ రక్షణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ పార్టీ నుంచి వైదొలిగిన నెల రోజుల్లోనే సీఆర్ కేశవన్ రాజీనామా చేయడం గమనార్హం.