Asianet News TeluguAsianet News Telugu

సన్యాసి కాదు.. కార్పోరేట్ వ్యాపారి, అక్కడే చెప్పుతో కొట్టాల్సింది: బాబా రాందేవ్‌పై సీపీఐ నారాయణ వ్యాఖ్యలు

మహిళలు, వారి వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలను సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఖండించారు. రాందేవ్‌ను చెప్పుతో కొట్టాల్సిందని,  ఒక సన్యాసి కార్పోరేట్ వ్యాపారిగా ఎలా మారుతాడని నారాయణ ప్రశ్నించారు.

cpi narayana fires on baba ramdev over his sexist remarks on woman
Author
First Published Nov 26, 2022, 8:55 PM IST

మహిళలు, వారి వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. దీనిపై మహిళా సంఘాలు భగ్గుమంటున్నాయి. బాబా తక్షణం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా బాబా రాందేవ్‌పై మండిపడ్డారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ మాటలు మాట్లాడేటప్పుడే మహిళలు బాబా రాందేవ్‌ను చెప్పుతో కొట్టాల్సిందని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగాను కార్పోరేట్ వ్యవస్థగా మార్చి.. పతంజలి పేరుతో వ్యాపారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఒక సన్యాసి కార్పోరేట్ వ్యాపారిగా ఎలా మారుతాడని నారాయణ ప్రశ్నించారు.

అంతకుముందు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్‌కు వ్యతిరేకంగా తెలంగాణ మహిళా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. బాబా రాందేవ్ తక్షణం క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులు డిమాండ్ చేశాయి. దాంతో దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన తెలియజేశారు. దీనిపై మాజీ మంత్రి గీతా రెడ్డి మాట్లాడుతూ... మహిళలపై నీచమైన మాటలు మాట్లాడిన రాందేవ్ బాబాపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన ఆ మాటలు మాట్లాడితే అక్కడి ప్రభుత్వం ఏం చేస్తోందని గీతా రెడ్డి ప్రశ్నించారు. దీనిపై హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేయబోతున్నట్లు ఆమె తెలిపారు. యోగా అనేది భారతీయ సంస్కృతిలో ఏనాటి నుంచో వుందన.. యోగా డేను నిర్వహించుకుంటున్నామని గీతా రెడ్డి పేర్కొన్నారు. యోగా మంచిదే గానీ యోగా గురువుగా ఇలాంటి వ్యక్తి వుండటం సిగ్గు చేటన్నారు. 

ALso REad:బట్టలు లేకున్నా నా కంటికి మహిళలు అందంగా కనిపిస్తారు .. బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు

కాగా.. మహారాష్ట్రలోని థానేలో పతంజలి యోగా పీఠం, ముంబై మహిళా పతంజలి యోగా సమితి సంయుక్తంగా యోగా సైన్స్ శిబిరాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృతా ఫడ్నవీస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా రాందేవ్ మైక్ అందుకుని మహిళల్ని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ మహిళలు చీరలో బాగుంటారు, సల్వార్ సూట్స్‌లో కూడా బాగుంటారు. ఇంకా చెప్పాలంటే నా కంటికైతే అసలేం ధరించకపోయినా అందంగానే కనిపిస్తారంటూ’’ బాబా రాందేవ్ వ్యాఖ్యలు చేశారు. 

ఏకంగా ఉప ముఖ్యమంత్రి భార్య , ఇతర ప్రముఖులు, వందలాది మంది మహిళల సమక్షంలో బాగా రాందేవ్ ఈ వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. దీనిపై నెటిజన్లు, మహిళా సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నారు. తక్షణం మహిళా లోకానికి బాబా రాందేవ్ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే బాబా రాందేవ్ ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణం లేకపోలేదు. యోగా సైన్స్ శిబిరానికి మహిళలు యోగా డ్రస్సుల్లో వచ్చారు. అదే రోజు శిబిరం, యోగా శిక్షణా కార్యక్రమం జరగడంతో వారు చీరలు ధరించేందుకు సమయం లేకపోయింది. ఈ పరిస్ధితిపై మాట్లాడాలనుకున్న బాబా రాందేవ్ ఏదో చెప్పాలనుకుని, ఇలా నోరు జారారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios